కసరత్తు చేస్తున్న యంత్రాంగం
జిల్లాలో 1807 ఎస్‌హెచ్‌జీ సభ్యుల ఎంపిక
విద్యార్థుల కొలతలు సేకరిస్తున్న విద్యాశాఖ
కుట్టు కూలిపై స్పష్టత కరువు
ఆదిలాబాద్: రానున్న విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు యూనిఫాం అందించే దిశగా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. యూనిఫాం కుట్టే బాధ్యతలను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించింది. ఆసక్తి, వృత్తి నైపుణ్యాలు కలిగిన సభ్యులను ఇప్పటికే ఎంపిక చేసింది. ప్రస్తుతం విద్యార్థుల కొలతలను సేకరిస్తున్నారు.
విద్యాశాఖ నుంచి వస్త్రం కొనుగోలు చేసి ఇచ్చిన వెంటనే దుస్తులు కుట్టే పనిని ప్రారంభించనున్నారు. అయితే కుట్టు కూలిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడం వారిని కొంత ఆందోళనకు గురి చేస్తోంది. యునిఫామ్‌లంతా వేసవిలోనే కుట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే జూన్‌లొనే విద్యార్థులకు కొత్త దుస్తులు అందనున్నాయి.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో మొత్తం 1,200 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 84,097 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో బాలురు 42,082 మంది, బాలికలు 42,015 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఏటా రెండు జతల యూనిఫాంలను ఉచితంగా అందజేస్తుంది. ఇదివరకు వీటిని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఆధ్వర్యంలో కుట్టించి విద్యార్థులకు అందించే వారు. పాఠశాల ప్రారంభమై నెలలు గడిచినా చాలా మందికి అందేవి కావు.
పైగా గుత్తేదారు విద్యార్థుల కొలతలు తీసుకోకుండా కుట్టడంతో సైజ్ సరిపోక ఇబ్బందిగా మరేది. ఇలాంటి పరిస్థితిని దూరం చేయడంతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యతలను ఎస్ హెచ్‌జీలకు అప్పగించింది. ఇందుకోసం అర్హులైన ఆసక్తి గల సభ్యులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కసరత్తు షురూ..
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. కుట్టు నైపుణ్యాలతో పాటు మిషన్ కలిగి ఉన్న 1,807 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులను ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు సంబంధించిన కొలతలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పాఠశాల, తరగతుల వారీగా కొలతలు తీసుకుంటున్నారు. వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి వాటిని ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అందించనున్నారు. అవసరమైన వస్త్రం అందిన వెంటనే వేసవి సెలవుల్లో యూనిఫాం కుట్టే ప్రక్రియను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
వస్త్రం రాగానే ఐకేపీ వారికి ఇస్తాం
2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంలను కుట్టించే బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఐకేపీ సిబ్బంది విద్యార్థుల కొలతలు తీసుకుంటున్నారు. ఆప్కో నుంచి వస్త్రం వచ్చిన వెంటనే వారికి అప్పగిస్తాం. వారు కుట్టించి విద్యార్థులకు అందిస్తారు. – సుజాత్‌ఖాన్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment