AP Anakapalle physically challenged student secured seat at IIM Ahmedabad - Sakshi
Sakshi News home page

విధిని ఎదిరించాడు.. విజయం సాధించాడు.. దివ్యాంగుడికి ఐఐఎం సీటు

Published Thu, May 11 2023 9:29 AM

Ap Anakapalle Physically Challenged Engineering Students Get Iim Seat - Sakshi

సాక్షి, అనకాపల్లి జిల్లా: విధి వక్రించినా పట్టుదలతో నిలబడ్డాడు. ధైర్యం కూడదీసుకుని ముందడుగు వేశాడు. మధ్యలో ఆగిపోయిన ఇంజనీరింగ్‌తోపాటు న్యాయవిద్యను సైతం పూర్తి చేసి అమెజాన్‌ సంస్థలో డేటా ఆపరేషన్‌ అసోసియేట్‌ ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఏకంగా క్యాట్‌లో ఉత్తీర్ణుడై ఐఐఎం సీటు సాధించాడు. ఈ నెల 21న అహ్మదాబాద్‌ ఐఐఎంలో చేరనున్నాడు.

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన ఈ విజేత పేరు ద్వారపురెడ్డి చంద్రమౌళి. తండ్రి వెంకటరమణ చిరు వ్యాపారి. తల్లి సత్యవతి ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌. చంద్రమౌళి కాకినాడ కైట్‌లో బీటెక్‌ చేస్తూ సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. 2018 మే 26న మేడపై ఉండగా ప్రమాదవశాత్తూ జారిపోయిన ఉంగరాన్ని తీసేందుకు యత్నించగా.. విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌కు గురై కాళ్లు, చేతులు కోల్పోవడంతో డీలా పడిపోయాడు.

కొత్త శక్తిని కూడదీసుకుని..
కొన్ని నెలలు గడిచాక చంద్రమౌళి నిరాశను వదిలిపెట్టాడు. శక్తిని కూడదీసుకుని కొత్త జీవితం ప్రారంభించాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం­తో మధ్యలో ఆగిపోయిన ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. అంతలోనే కరోనా చంద్రమౌళికి మరో పరీక్ష పెట్టింది. తండ్రి వెంకటరమణ కుమారుడి పక్కనే రక్షణ సూట్‌ ధరించి నెల రోజుల పాటు సేవలందించారు. వారి మొండి ధైర్యానికి విధి తలవంచింది. నెల తర్వాత ఇంటికి వచ్చిన చంద్రమౌళి తేరుకుని తన గమ్యం వైపు అడుగులు వేశాడు.

ఆప్తుడైన న్యాయవాది ప్రభాకర్, స్నేహితుడు ప్రసాద్‌ అండగా నిలిచి మానసిక స్థైర్యం అందించారు. దీంతో చంద్రమౌళి మొండి చేతులతోనే పనులు చేయడం ప్రారంభించాడు. ల్యాప్‌టాప్‌ను ఆపరేట్‌ చేయడం సాధన చేశాడు. విశాఖలో కృత్రిమ కాళ్లు తీసుకుని నడవడం కూడా కొద్దికొద్దిగా అలవాటు చేసుకున్నాడు. మూడు నెలల్లో అన్ని పనులూ చేయడం ప్రారంభించాడు. కరోనా తర్వాత ఇంజనీరింగ్‌లో ఉద్యోగాలు కష్టతరమవుతున్నాయని భావించి అనకాపల్లిలో బీఎల్‌  పూర్తి చేశాడు. జీవనోపాధికి అమెజాన్‌లో డేటా ఆపరేషన్‌ అసోసియేట్‌ ఉద్యోగం సంపాదించాడు. కొన్నాళ్ల నుంచి ఇంటినుంచే ఆ ఉద్యోగం చేస్తున్నాడు.

పట్టుదలతో చదివి కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) స్క్రైబ్‌ సహాయంతో రాసి ఉత్తీర్ణుడయ్యాడు. దేశంలోనే అత్యున్నత బిజినెస్‌ స్కూల్‌గా ప్రసిద్ధి చెందిన అహ్మదాబాద్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో సీటు సాధించాడు. ఈ నెల 21న జాయిన్‌ అయ్యేందుకు సిద్ధపడుతు­న్నాడు. ఎంత కష్టం ఎదురైనా కలత చెందవద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని చంద్రమౌళి సూచిస్తున్నాడు.
చదవండి: అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి..

 
Advertisement
 
Advertisement