Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్‌ లైఫ్‌లో.. | IPL 2024 SRH Owner Kavya Maran Personal Life, Myths And Facts if She Has Boyfriend Or Not? | Sakshi
Sakshi News home page

Kavya Maran Unknown Facts: మంచి మనసు.. కానీ ఒంటరితనం? వారి పేర్లతో కావ్య పేరును ముడిపెట్టి..

Published Mon, May 27 2024 6:06 PM | Last Updated on Mon, May 27 2024 6:54 PM

IPL 2024 SRH Owner Kavya Maran Personal Life: Myths And Facts if She Has

PC: IPL/SRH

ఐపీఎల్‌ వేలం మొదలు... స్టేడియంలో తన జట్టును ఉత్సాహపరచడం.. గెలిచినపుడు చిన్న పిల్లలా సంబరాలు చేసుకోవడం.. ఓడినపుడు అంతే బాధగా మనసు చిన్నబుచ్చుకోవడం..

అంతలోనే ఆటలో ఇవన్నీ సహజమే కదా అన్నట్లుగా ప్రత్యర్థిని అభినందిస్తూ చప్పట్లు కొట్టడం.. ఇలా ప్రతీ విషయంలోనూ ఆమె ఓ ప్రత్యేక ఆకర్షణ. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను ఫాలో అయ్యే వాళ్లలో చాలా మందికి ఆమె కంటే క్రష్‌.

ఆమె మ్యాచ్‌ వీక్షించడానికి వచ్చిందంటే చాలు.. ఆద్యంతం తను పలికించే హావభావాలు.. స్టాండ్స్‌లో చుట్టుపక్కల వారితో తను మెదిలే విధానం.. ఆనాటి హైలైట్స్‌లో ముఖ్యమైనవిగా నిలుస్తాయనడం అతిశయోక్తి కాదు‌.

తను నవ్వితే అభిమానులూ నవ్వుతారు. తను భావోద్వేగంతో కంటతడి పెడితే తామూ కన్నీటి పర్యంతమవుతారు. ఐపీఎల్‌-2024 ఫైనల్‌ సందర్భంగా ఇలాంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఆమె పేరేంటో అర్థమైపోయిందనుకుంటా.. యెస్.. కావ్యా మారన్‌. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ ఓనర్‌.

వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు
దేశంలోనే అతి పెద్ద మీడియా గ్రూపులో ఒకటైన సన్‌ టీవీ గ్రూప్‌ నెట్‌వర్క్‌ అధినేత కళానిధి మారన్‌- కావేరీ మారన్‌ దంపతుల ఏకైక కుమార్తె. వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు.

తమిళనాడులోని చెన్నైలో ఆగష్టు 6, 1992లో జన్మించారు కావ్య. అక్కడే స్టెల్లా మేరీ కాలేజీలో బీకామ్‌ చదివిన ఆమె.. 2016లో ఇంగ్లండ్‌లోని వార్విక్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు.

తల్లిదండ్రులు ఇద్దరూ వ్యాపారవేత్తలే కావడంతో కావ్య కూడా అదే బాటలో పయనిస్తున్నారు. 2018లో సన్‌రైజర్స్‌ సీఈఓగా ఎంట్రీ ఇచ్చిన కావ్య.. అంతకంటే ముందే సన్‌ మ్యూజిక్‌, సన్‌ టీవీ ఎఫ్‌ఎం రేడియోలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

తీవ్ర స్థాయిలో విమర్శలు
ఇక ఐపీఎల్‌లో వేలం మొదలు కెప్టెన్‌ నియామకం వరకు అన్ని విషయాల్లోనూ భాగమయ్యే కావ్యా మారన్‌.. ఈ ఏడాది అనుకున్న ఫలితాలు రాబట్టడంలో సఫలమయ్యారు. కానీ.. సీజన్‌ ఆరంభంలో మాత్రం తీవ్ర విమర్శల పాలయ్యారు కావ్య.

ఆస్ట్రేలియా కెప్టెన్‌, వన్డే వరల్డ్‌కప్‌-2023 విజేత ప్యాట్‌ కమిన్స్‌ కోసం ఏకంగా.. రూ. 20.50 కోట్లు ఖర్చు చేయడం.. అతడిని కెప్టెన్‌గా నియమించడం, బ్రియన్‌ లారా స్థానంలో డానియల్‌ వెటోరీని కోచ్‌గా తీసుకురావడం వంటి నిర్ణయాలను మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు.

ఇప్పటికే ఐడెన్‌ మార్క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, ట్రావిస్‌ హెడ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ వంటి వాళ్లు జట్టులో ఉండటంతో తుదిజట్టు కూర్పు ఎలా ఉంటుందో అంటూ ఎద్దేవా చేశారు. పేపర్‌ మీద చూడటానికి జట్టు బాగానే కనిపిస్తున్నా.. మైదానంలో తేలిపోవడం ఖాయమంటూ విమర్శించారు.

సంచలన ప్రదర్శన
అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సన్‌రైజర్స్‌ ఈసారి అద్భుతాలు చేసింది. గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన హైదరాబాద్‌ ఈసారి సంచలన ప్రదర్శనతో ఫైనల్‌ చేరింది.

విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా నిలిచి లీగ్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులు సృష్టించింది. అయితే, తుదిమెట్టుపై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

చెన్నై వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలడం.. కేకేఆర్‌ ఏకపక్షంగా గెలవడంతో కావ్యా మారన్‌ కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లు కారుస్తూనే కేకేఆర్‌ను అభినందించారు కూడా!

ఈ నేపథ్యంలో కావ్య మంచి మనసును కొనియాడుతూ ఆమె అభిమానులు సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో సన్ నెట్‌వర్క్‌ మాజీ ఉద్యోగిగా చెప్పుకొన్న ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.

ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మాత్రమే!
‘‘తన తలిదండ్రుల కంటే కూడా కావ్య ఎంతో గొప్ప వ్యక్తి. మంచి మనసున్న అమ్మాయి. కానీ ఎందుకో తనకు ఎక్కువగా ఫ్రెండ్స్‌ ఉండరు. సన్‌ మ్యూజిక్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ మినహా ఇతర కంపెనీ బాధ్యతలేవీ తల్లిదండ్రులు ఆమెకు అప్పగించరు.ఇది కూడా ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మాత్రమే!

ఐపీఎల్‌ వేలం సమయంలో కావ్య గురించి చాలా మంది జోకులు వేశారు. కానీ క్రికెట్‌ పట్ల తనకున్న ప్యాషన్‌ వేరు. వేలం నుంచి ఫైనల్‌ దాకా ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేయగలిగింది. తను కోరుకున్న ఫలితాలు రాబట్టింది.

కావ్య మిలియనీర్‌ అయినప్పటికీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓనర్‌(సంజీవ్‌ గోయెంకా కేఎల్‌ రాహుల్‌ను బహిరంగంగానే తిట్టడం)లా కాదు. ఫైనల్లో తమ జట్టు ఓటమిపాలైనా కన్నీళ్లు దిగమింగుకుంటూ నవ్వడానికి ప్రయత్నించిన గొప్ప హృదయం ఉన్న వ్యక్తి’’ అని సదరు నెటిజన్‌ పేర్కొన్నారు.

ఒంటరితనమా? ఎందుకు?
తన పోస్టులో సదరు నెటిజన్‌ కావ్య ఒంటరితనం నుంచి విముక్తి పొందడం కోసమే ఈ వ్యాపకాలు అంటూ పేర్కొనడం చర్చనీయాంశమైంది. తోబుట్టువులు, స్నేహితులు(ఎక్కువగా) లేరు కాబట్టి ఇలా అన్నారా?

లేదంటే 32 ఏళ్ల కావ్య వ్యక్తిగత జీవితంలో ఏమైనా దెబ్బతిన్నారా? అనే చర్చ జరుగుతోంది. కాగా కావ్య ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నారు. గతంలో.. తమిళ ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌, టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌తో కావ్య పేరును ముడిపెట్టే ప్రయత్నం చేశారు గాసిప్‌రాయుళ్లు.

అయితే, అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది. మరికొన్ని సైట్లు మాత్రం కావ్య ఓ బిజినెస్‌మేన్‌తో గతంలో ప్రేమలో ఉన్నారని కథనాలు ఇచ్చాయి. కానీ.. అవి కూడా రూమర్లే! ప్రస్తుతానికి కావ్య తన కెరీర్‌, తన తండ్రి వ్యాపారాలను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న విషయాల మీద మాత్రమే దృష్టి సారించారని సమాచారం.

సౌతాఫ్రికాలో దుమ్ములేపుతూ
అందుకు తగ్గట్లుగానే ఆమె అడుగులు సాగుతున్నాయి. కేవలం ఐపీఎల్‌లోనే కాకుండా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ కావ్య కుటుంబానికి ఫ్రాంఛైజీ ఉంది. సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ పేరిట నెలకొల్పిన ఈ జట్టుకు ఐడెన్‌ మార్క్రమ్‌ కెప్టెన్‌. 2023 నాటి అరంగేట్ర సీజన్‌లో, ఈ ఏడాది కూడా సన్‌రైజర్స్‌కు అతడు టైటిల్‌ అందించాడు. సౌతాఫ్రికాలో వరుసగా రెండుసార్లు ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్‌.. ఐపీఎల్‌-2024లో ఆఖరి పోరులో ఓడి టైటిల్‌ చేజార్చుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement