బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపుల కేసులో ఇరుకున్న హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణ త్వరలోనే భారత్‌కు తిరిగి రానున్నారు. ఈనెల 31న సిట్ ముందు విచారణకు హాజరు కానున్నట్లు స్వయంగా తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.
‘నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మే 31 ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరవుతాను. విచారణకు సహకరిస్తాను. నాపై నమోదైనవి తప్పుడు కేసులు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.’ అని సోమవారం పేర్కొన్నారు.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ కుట్రగా రేవణ్ణ పేర్కొన్నాడు. తాను మానసిక ఒత్తిడి, ఒంటరిగా ఉన్నట్లు చెప్పాడు. తన ఆచూకీ వివరాలు చెప్పనందుకు జేడీఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు కూడా చెప్పారు.
‘విదేశాల్లో నేను ఎక్కడ ఉన్నానో సరైన సమాచారం అందించనందుకు నా కుటుంబ సభ్యులకు, మా కుమారన్న (కుమారస్వామి],పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు ముగిసినప్పుడు, నాపై ఎటువంటి కేసు లేదు. సిట్ ఏర్పాటు చేయలేదు. నేను వెళ్లిన రెండు, మూడు రోజుల తర్వాత యూట్యూబ్‌లో నాపై ఈ ఆరోపణలను చూశాను. అలాగే ఏడు రోజుల సమయం కావాలని నా లాయర్ ద్వారా సిట్‌కి లేఖ రాశాను.’ అని పేర్కొన్నారు.
కాగా మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడైన ప్రజ్వల్ రేవణ్ణ(36) మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక మహిళలను లైంగికంగా వేధించినట్లు వీడియో బయటకు రావడంతో ప్రజ్వల్ ఏప్రిల్ 26న దేశం విడిచి వెళ్లిపోయారు.
కాగా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు హాసన్ జిల్లా హొళె నరసీపుర పోలీస్ స్టేషన్‌లో ప్రజ్వల్‌తోపాటు ఆయన తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. రేవణ్ణ రాసలీలలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అతనిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. అనంతరం అతనిపై బ్లూ కార్నర్ నోటీసు' కూడా జారీ అయ్యింది.
తన మనవడిని భారతదేశానికి తిరిగి రావాలని, పోలీసులకు లొంగిపోవాలని లేదా అతని ఆగ్రహాన్ని ఎదుర్కోవాలని కోరుతూ హెచ్‌డి దేవెగౌడ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత అతని ప్రకటన రావడం గమనార్హం. అంతేగాక ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గత వారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment