పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి హామీ
జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, దేశ సంపద ఈ దేశ ప్రజలకే చెందాలి
కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో ఏనాడూ పూజలను అడ్డుకోలేదని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఇంటి పెద్ద బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమ చేస్తామని, మహిళలను మహారాణులుగా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క హామీ ఇచ్చారు. మంగళవారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ తన 55 ఏళ్ల పరిపాలనలో ఏనాడూ పూజా కార్యక్రమాలను అడ్డుకోలేదన్నారు.
కాంగ్రెస్ సర్కారు ఎప్పుడూ పేదల గురించే ఆలోచిస్తుందని, బీజేపీ మాత్రం పేదలకు రూపాయి కూడా ఇవ్వకుండా అదానీ, అంబానీ వంటి కొద్దిమంది పెద్దలకు మాత్రం రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని మండిపడ్డారు. మోదీ 10 ఏళ్ల పాలనలో రూ.100 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని అప్పులకుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అదేవిధంగా అన్ని చోట్లా రిజర్వేషన్లు పెంచుతామని ఇండియా కూటమి చెప్పిందన్నారు.
దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య బీమా
యూపీఏ హయాంలో ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత, రూరల్ హెల్త్ మిషన్, భూ సంస్కరణలు చేసినప్పుడు సైతం బీజేపీ నేతలు విమర్శించారని భట్టి గుర్తు చేశారు. ప్రాణాలు లెక్కచేయకుండా సరిహద్దుల్లో కాపలాకాస్తున్న వీర జవాన్ల స్థాయిని మోదీ ప్రభుత్వం దిగజార్చిందని మండిపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని, దేశ వ్యాప్తంగా ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.
మద్దతు ధర, రుణమాఫీ కోసం ఢిల్లీలో రైతులు నెలల తరబడి ఆందోళన చేస్తే మోదీ 10 నిమిషాలు కూడా వారి కోసం కేటాయించలేదని భట్టి గుర్తు చేశారు. జనాభా దామాషా ప్రకారం ఈ దేశ సంపద, వనరులు పంపిణీ చేయడమే లక్ష్యంగా రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర, మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు యాత్ర చేసిన విషయాన్ని భట్టి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment