సాక్షి, గుంటూరు: ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది. జూన్ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది.
కాగా, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఈవీఎంకు సంబంధించి ఒక కేసు నమోదయింది. దీనిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు ఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరట ఇచ్చింది. అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ఉన్నందున కేసులోకి వెళ్లట్లేదని, పిన్నెల్లిని జూన్ 5 వరకూ అరెస్టు చేయవద్దని హైకోర్టు తేల్చిచెప్పింది.
హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో కొందరు పోలీసు అధికారులు ప్లాన్ మార్చారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పల్నాడు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పిన్నెల్లిపై వరుస కేసులు పెట్టారు. కౌంటింగ్ తేదీ కంటే ముందే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని, అసలు ఆ సమయంలో పిన్నెల్లి లేకుండా చూడాలని.. ఇదే సమయంలో పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారంటూ ఎల్లో మీడియాకు లీకులిచ్చారు.
ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతుండడంతో.. పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనల సందర్భంగా పోలీసులకు సంబంధించి ఓ కీలకమైన కుట్ర బయటపడింది. ఈ కేసులను ఎప్పుడు పెట్టారంటూ హైకోర్టు ప్రశ్నించగా.. మే 22న నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పిన్నెల్లి తరపున లాయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో ఈ విషయంలో మొత్తం రికార్డులు తెప్పించమని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ముందు రికార్డులు సమర్పించగా.. వాటిని హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై నేడు ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడిస్తూ.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది.
ఇదీ చదవండి: AP High Court : పిన్నెల్లి కేసులో రికార్డులు మార్చిందెవరు?
Comments
Please login to add a commentAdd a comment