బాపట్ల జిల్లాలో రైతులకు భరోసా కల్పిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్
సాక్షి, అమరావతి, నెట్‌వర్క్: మాండూస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోని 99 మండలాల్లో 416 గ్రామాలు వర్షాల ప్రభావానికి గురయ్యాయి. నెల్లూరు జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో 208 మంది, చిత్తూరు జిల్లాలో 416 మంది, తిరుపతి జిల్లాలోని కేంద్రాల్లో 571 మంది మొత్తం 1,195 మందికి ఆశ్రయమిచ్చి భోజన సదుపాయాలు కల్పించారు. ఇళ్లకు తిరిగి వెళుతున్న బాధితులకు రూ.2 వేల చొప్పున సాయాన్ని అందిస్తున్నారు. పారిశుధ్య చర్యలు చేపట్టి అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పంట, ఆస్తి నష్టాలను ఆయా శాఖలు అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యాయి.
వదలని వర్షాలు..
తుపాన్ ప్రభావిత జిల్లాల్లో వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 12.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విశాఖ జిల్లా భీమునిపట్నంలో 10.2 సెంటీమీటర్లు, నెల్లూరు జిల్లా కందుకూరులో 9.8, విశాఖ జిల్లా భీమిలిలో 9.4, ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో 8.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అన్నమయ్య జిల్లా కురబలకోటలో 7 సెంటీమీటర్ల వర్షం పడింది.
1,267 బృందాలు
తుపాన్ ప్రభావిత గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణతో పాటు రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ 1,267 బృందాలను సిద్ధం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం శాఖ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మురుగు కాల్వలలో పూడిక తొలగింపు పనులను వెంటనే చేపట్టాలని సూచించారు.
21 కల్లా నష్టం లెక్కలు
మాండూస్ తుపాన్ వల్ల జరిగిన పంట నష్టం లెక్కింపు ప్రక్రియను ఈ నెల 21వ తేదీకల్లా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ అధికారులకు సూచించారు. పంట నష్టం జాబితాలను సామాజిక తనిఖీల కోసం 26 కల్లా పూర్తి చేసి డిసెంబర్ 27న ఈ – క్రాప్ ప్రాతిపదికన తుది జాబితాలను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. తుపాన్ వల్ల రబీ సీజన్‌లో దెబ్బ తిన్న పంటల స్థానంలో రెండోసారి విత్తుకునేందుకు వీలుగా ప్రతిపాదనలను రెండు రోజుల్లో పంపాలని అధికారులకు సూచించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మల్లిమడుగు, కాళంగి, అరిణియార్, ఎన్టీఆర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండిపోవటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అత్యధికంగా సోమల మండలంలో 37.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 2,650 చెరువులు ఉండగా 90 శాతం పూర్తిగా నిండిపోయాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద చెరువైన తొండమనాడు చెరువు కలుజు పారుతోంది. 10,500 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. చిల్లకూరు మండలం పాలెం గ్రామానికి చెందిన కిడ్నీ బాధితుడు వ్యాధిగ్రస్తుడు ప్రదీప్ నాయుడు ఆక్వా గుంత వద్ద చిక్కుకోవడంతో రెస్క్యూటీం పడవ ద్వారా చేరుకుని రక్షించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయానికి సోమవారం సాయంత్రానికి 26 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment