సాక్షి, అమరావతి: ఎండలు మండుతున్నాయో లేదో ఏసీ గదుల్లో కూర్చునే రామోజీకేం తెలుస్తుంది. ఒకసారి కళ్లు తెరిచి రోడ్డు మీదకు వస్తే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతుంది. వాతావరణ మార్పుల కారణంగా ఫిబ్రవరి నెలలోనే ఎండలు ముదురుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. అయినప్పటికీ ప్రజలు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా కోతలు లేని నాణ్యమైన విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అందిస్తున్నాయి.
కానీ ఎండ కన్నెరుగని డ్రామోజీ ‘ఎండలు ముదరక ముందే ఎడా పెడా కోతలు’ శీర్షికన ఈనాడులో అడ్డగోలుగా ఓ అబద్దాన్ని అచ్చేశారు. ఈ అసత్య కథనంపై రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. రాష్ట్రంలో ఏదైనా సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల సమయంలో వచ్చే స్వల్ప విద్యుత్ అంతరాయాలను వ్యవసాయ విద్యుత్ కోతలుగా చూపిస్తూ తరచూ కథనాలు ప్రచురించడం ఈనాడు దిగజారుడుతనానికి నిదర్శనమని, ఇలాంటి నీతిమాలిన పాత్రికేయం ఆ పత్రిక పతనానికి నాంది అని దుయ్యబట్టాయి. వాస్తవాలేమిటో వివరించాయి.
ఈనాడు ఆరోపణ: విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయని ప్రకాశం జిల్లాలో ఓ గ్రామం రైతులు, విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ గ్రామం రైతులు ఆందోళన చేశారు.
వాస్తవం: పార్వతీపురం మన్యం జిల్లా యర్రసామంతవలస 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో ఏర్పడ్డ విద్యుత్ అంతరాయం, ప్రకాశం జిల్లా ఉమా మహేశ్వరపురం 33/11 కేవి సబ్ స్టేషన్, అద్దంకి దగ్గర గుండ్లకమ్మ వంతెన సమీపంలో 33 కేవీ కుంకుపాడు లైన్ మరమ్మతుల వల్ల తలెత్తిన అంతరాయాలను వ్యవసాయ విద్యుత్ కోతలుగా ఈనాడు ప్రచురించింది. అది అవాస్తవం. నిజానికి ఈ రెండు చోట్లా ప్రత్యామ్నాయంగా ఏపీ ట్రాన్స్‌కో హై వోల్టేజ్ సబ్ స్టేషన్ లైన్ల ద్వారా విద్యుత్ అందించడం కూడా జరిగింది. వ్యవసాయ వినియోగదారులకు పగటి పూట విద్యుత్ సరఫరాకు అధికారులు గతంలోనే చర్యలు తీసుకున్నారు. అక్కడక్కడా సమస్యలు తలెత్తినా వెంటనే నివారించేందుకు సబ్‌స్టేషన్, లైన్ల సామర్థ్యం పెంపుదల పనులు జరుగుతున్నాయి. ఇంక ఆందోళన చేయాల్సిన అవసరమేముంది? అదంతా కేవలం రామోజీ మార్కు సృష్టి మాత్రమే.
ఈనాడు ఆరోపణ: రైతులకు పగటిపూట అంతరాయం లేకుండా 9 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పిన సర్కారు.. వేసవి ఆరంభంలోనే చేతులెత్తేసింది. ముందస్తు ప్రణాళికల్లో విఫలమైంది.
వాస్తవం: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరుగుతోంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా నాణ్యమైన నిరంతరాయ విద్యుత్‌ను విద్యుత్ సంస్థలు అందిస్తున్నాయి. ఇందుకోసం బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికను రూపొందిస్తున్నాయి. రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్తును ఎటువంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేస్తున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఈ ఎడాది రబీ సీజను నుండి సోలార్ విద్యుత్‌ను వ్యవసాయానికి ప్రత్యేకంగా సరఫరా చేయనున్నాయి. గడిచిన పది రోజుల్లో ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు ఏమాత్రం కొరత లేకుండా విద్యుత్ అందిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment