ఆ బుర్రలో ‘సైతాన్‌’ తిష్ట ఫ్యాక్ట్‌ చెక్‌ | Sakshi
Sakshi News home page

FactCheck: ఆ బుర్రలో ‘సైతాన్‌’ తిష్ట ఫ్యాక్ట్‌ చెక్‌

Published Thu, Apr 25 2024 7:01 PM

Eenadu Ramoji Rao Fake News On AP Christian Minority - Sakshi

అందుకే..‘పాపపు’ రాతలతో నిజాలకు ‘శిలువే’స్తున్న రామోజీ

‘జీసస్‌’ కాలంలో అబద్ద ప్రవక్తల మాదిరిగా.. ఇప్పుడు అబద్ద ప్రచారం

మేనిఫెస్టోని పవిత్ర బైబిల్‌గానే భావించిన సీఎం జగన్‌

చెప్పింది చెప్పినట్టు అమలు చేసి చూపిస్తున్న వైనం

నిజమైన ‘మేలులు’ జగన్‌ పాలనలోనే

బాబు హయాంలో క్రైస్తవులకు ఒరిగిందేమిటీ ?

హామీలు ఎవరు అమలు చేశారో మీకు తెలియదా రామోజీ ?

మీ అబద్దాలకు ప్రజాకోర్టులో శిక్ష పడటం ఖాయం

రామోజీ మెదడును సైతాన్‌ శోధించింది. అందుకే దయ్యం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం అబద్దాలు అచ్చు వేస్తూ చంద్రబాబు పాలన మొత్తం నీతివంతంగా జరిగినట్లు వక్రీకరిసు‍్తన్నారు. ‘పాపపు’ రాతలు రాస్తూ ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నారు. దీన్నే నిత్యం పనిగా పెట్టుకుని కల్లిబొల్లి మాటలతో అబద్ద ప్రచారం చేస్తున్నారు. ‘జీసస్‌’ కాలంలో ‘అబద్ద ప్రవక్తలు’ ఉండేవారు. ఇప్పుడు అచ్చు గుద్దినట్లు వారికి పదిరెట్లు ఎక్కువగా ‘ఈనాడు’ అబద్దాలను ప్రచారం చేస్తోంది. నిస్సిగ్గుగా నిజాలను తప్పులుగా రాస్తున్న రామోజీకి ప్రజాకోర్టులో ఆ ‘కరుణామయుడు’ శిక్ష వేయడం మాత్రం ఖాయం.

(సాక్షి, అమరావతి) సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను ప్రకటించిన మేనిఫెస్టోను బైబిల్ అంత పవిత్రంగా భావించారు. అందుకే మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటీ చిత్తశుద్దితో అమలు చేసి చూపించారు. అంతకు ముందు మేనిఫెస్టోను చిత్తు కాగితంలా చూసిన చంద్రబాబు 600పైగా హామీలిచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని రామోజీకి తెలియదా?. మేనిఫెస్టోను అమలు చేయని చంద్రబాబు దాన్ని టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కూడా తొలగించిన మాయల మరాఠీ. ఇప్పుడు జర్నలిజం విలువలకు శిలువేస్తూ రామోజీ నీతులు వల్లిస్తున్నారు.

ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందిన సీఎం వైఎస్‌ జగన్‌పై రోజు ఏదో ఒకటి పచ్చి అబద్దాలతో అచ్చేస్తూ రామోజీ పైశాచికానందాన్ని పొందుతున్నారు. తాజాగా క్రైస్తవులకు టీడీపీ హయాంలో బాగా చేశారు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏమి చేయలేదంటూ.. ‘హామీలకు శిలువ’ అంటూ అడ్డగోలు అబద్దాలతో రామోజీ వార్త అచ్చేయడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆరోపణ: పాస్టర్లను బెంబేలెత్తించారు
వాస్తవం: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక పాస్టర్లకు గౌరవ వేతనం అందించి అండగా నిలిచింది. కోవిడ్‌ కష్టంలోను పాస్లర్లకు నెలకు రూ.5వేలు చొప్పున అందించి సీఎం వైఎస్‌ జగన్‌ పెద్ద మనసు చాటుకున్నారు. ఈ ప్రభుత్వం నెలకు రూ.5వేలు చొప్పున 8,427 మందికి ఇప్పటి వరకు గౌరవ వేతనంగా రూ.71.10కోట్లు అందించింది. కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో క్రిస్టియన్లతోపాటు పాస్టర్లకు కలిపి 29,841 మందికి కోవిడ్‌ అసిస్టెన్సీ వన్‌ టైమ్‌ గ్రాంట్‌గా రూ. రూ.14.90కోట్లు అందించింది. చంద్రబాబు తన హయాంలో ఏనాడు పాస్టర్లను పట్టించుకోలేదు. అయినా చంద్రబాబు కోసం రామోజీ దాసోహం అయిపోతున్నారు.

ఆరోపణ: ఆర్థిక సాయం రెట్టింపు చేస్తామని
వాస్తవం: పవిత్ర జెరుసలేం యాత్రకు గత టీడీపీ ప్రభుత్వం సాయం చేసినట్టు రామోజీ మసి పూస్తున్నారు. ఆయన హయాంలో నిధులు కేటాయించినట్టు చూపించినా సాయం అందించింది నామమాత్రమే. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకం కింద వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్న ప్రతి ‍క్రైస్తవునికి రూ.60వేలు, రూ.3లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.30వేలు సాయాన్ని అందించింది. ఇప్పటివరకు 1,060 మంది లబ్ధిదారులకు రూ.591.60 లక్షలు నిధులు అందించారు.

ఆరోపణ: సాయాన్ని కాదు..జాప్యాన్ని పెంచారు..
వాస్తవం: గత ప్రభుత్వం సాయం చేసింది గోరంత అయినా రామోజీకి ఆనందంగా ఉంటుంది. నిరుపేద ఆడ పిల్లల పెళ్లికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ మింగుడు పడటంలేదు. వాస్తవానికి గత ప్రభుత్వం తోచినప్పుడు సాయం అందించేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా క్యాలెండర్‌( నిర్థిష్ట గడువు) ప్రకటించి ప్రతి మూడు నెలలకు (త్రైమాసికం) ఒకసారి పెళ్లి సాయాన్ని విడుదల చేస్తోంది. గతంలో దరఖాస్తు చేసుకోవాలంటే ఆపసోపాలు పడేవారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాయాల ద్వారా స్థానికంగా దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కలిగింది.

దీంతో ఉన్న చోట నుంచే ధరఖాస్తు చేసుకోవడంతోపాటు ఆర్థిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలకు పొందుతున్నారు. గత ప్రభుత్వంలో బకాయిలు కాలానుగుణంగా విడుదల చేయలేదు. ఇప్పుడు వివాహం జరిగిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకుంటే మూడు నెలలకు ఒకసారి అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆడ పిల్లల చదువులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో వివాహాలు చేసుకునే వారు కనీసం పదవ తరగతి విద్యార్హత ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. వారిని ఉన్నత చదువులు చదివించాలనే సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నతాశయం ఆచరణలో మంచి ఫలితాలు ఇస్తోంది.

ఆరోపణ: పెళ్లి కానుక హుళక్కే..
వాస్తవం: పేదల పెళ్లికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలిచినట్టు రామోజీ అడ్డగోలుగా రాసేశారు. వాస్తవానికి పేద బిడ్డల పెళ్లికి సాయం అందించేలా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ‘మాస్‌ మ్యారేజ్‌’ పేరుతో ఆర్థిక సాయాన్ని అందించారు. క్రైస్తవ ఆడ బిడ్డల పెళ్లికి రూ.25వేల ఆర్థిక సాయం, కొత్త బట్టలతోపాటు పెళ్లి వస్తువులు అందించేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌ పెట్టిన పథకాన్ని 2015లో ‘దుల్హాన్‌’ పథకంగా పేరు మార్చారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు హడావుడిగా 2018లో రూ.25వేల ఆర్థిక సాయాన్ని రూ.50వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.

పెంచిన మొత్తాన్ని అందించకపోగా బకాయిలు పెట్టారు. చంద్రబాబు హయాంలో 2018 నుంచి జరిగిన 43,490 జంటల(పెళ్లిళ్లు)కు రూ.177.96 కోట్ల బకాయిలను చెల్లించలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ బకాయిలను విడుదల చేసి పేద బిడ్డలకు భరోసా ఇచ్చింది. అంతేకాకుండా ఆయా వర్గాలకు గతం కంటే రెట్టింపు చేసి మరీ సీఎం వైఎస్‌ జగన్‌ పెళ్లి సాయాన్ని అందిస్తుండటం విశేషం.

ఆరోపణ: బీమా అమలులోను కుయుక్తులే..
వాస్తవం: బీమా అమలు లేదంటూ రామోజీ కుయుక్తులతో కూడిన ఆరోపణలు చేశారు. వాస్తవానికి వైఎస్సార్‌ బీమా పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ పేద వర్గాలకు అండగా నిలిచారు. కుటంబంలో ప్రధాన ఆధారమైన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా, వైకల్యానికి గురైనా ఆ కుటుంబం రోజువారీ గడవడం కష్టమని భావించి బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తోంది. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల లోపు వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు, శాశ్వత వైకల్యానికి గురైతే రూ.5లక్షలు, సహజ మరణమైతే రూ.లక్ష బీమా మొత్తాన్ని చెల్లిస్తోంది.

ఆరోపణ: గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌నూ ఎగ్గొట్టారు
వాస్తవం: చర్చిల నిర్మాణం, ప్రహారీల ఏర్పాటుకు గత ప్రభుత్వం గొప్పగా చేసింది.. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని రామోజీ బురదచల్లేశారు. వాస్తవానికి కొత్త చర్చిల నిర్మాణం, పాత చర్చిల మరమ్మత్తులు, పునరుద్ధరణ, అభివృద్ధి, ప్రహారీ, మరుగుదొడ్లు, మౌళిక వసతుల కోసం రూ.5 లక్షల సాయంతో పాటు శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.3 లక్షల నుంచి 5 లక్షలు చొప్పున నిధులు కేటాయించింది. ఇప్పటి వరకు 98 చర్చిలకు రూ.5.67కోట్లు నిధులు కేటాయించింది.

ఐదేళ్లలో 24,304.37కోట్ల లబ్ది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక క్రిస్టియన్‌ మైనార్టీలకు ఐదేళ్లలో నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందాయి. క్రిస్టియన్‌ మైనారిటీలకు డీబీటీ ద్వారా రూ.13,239.49కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా మరో 11,064.88కోట్లు లబ్ధిని అందించింది. ఐదేళ్లలో మొత్తం రూ.24,304.37కోట్లు లబ్దిని చేకూర్చింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ క్రిస్టియన్‌ మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా 1,82,270 మందికి రూ.416.56కోట్లు లబ్ది అందించింది. చంద్రబాబు ఓట్ల కోసం మాయ మాటలతో మభ్య పెడితే.. సీఎం జగన్‌ ప్రజల నమ్మకాన్ని పొందారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement