తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్‌ | AP Elections 2024: CM YS Jagan Speech At Hindupur | Sakshi
Sakshi News home page

అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: హిందూపురం రోడ్‌షోలో సీఎం జగన్‌

Published Sat, May 4 2024 12:56 PM | Last Updated on Sat, May 4 2024 3:07 PM

AP Elections 2024: CM YS Jagan Speech At Hindupur

శ్రీసత్యసాయి, సాక్షి:  చంద్రబాబు చేసేవన్నీ మాయలు.. కుట్రలు అని, ఈ 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  హిందూపురం అంబేద్కర్‌ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నాం జరిగిన ప్రచార భేరిలో సీఎం జగన్‌ ప్రసంగించారు.  

మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది. ఇవి కేవలం  ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు. మీ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడం. పొరపాటున మళ్లీ చంద్రబాబుకి ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. లేచి లకలకలక అంటూ మీ దగ్గరికి వస్తుంది. అందరూ గుర్తుపెట్టుకోండి.

దేవుడి దయతో.. ప్రజల చల్లని దీవెనలతో 58 నెలల మీ బిడ్డ పాలనలో రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా, ప్రతీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా రూ.2 లక్షల 70 కోట్ల వేల రూపాయలు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు  డీబీటీ  ద్వారా బటన్‌లు నొక్కడం జమ చేశాడు. గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?. గతంలో ఎన్నడూ లేనంతగా, రాష్ట్ర చరిత్రలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే.. 2 లక్షల 30 వేల ఉద్యోగాలిచ్చాడు. 

మేనిఫెస్టోలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 99 శాతం హామీలు అమలు అయ్యింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. గతంలో.. ఎన్నికలప్పుడు మేనిఫెస్టో తీసుకొచ్చి.. తర్వాత చెత్త బుట్టలో వేస్తారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ.. మేనిఫెస్టో హామీలు నెరవేర్చి, ఇప్పుడు ఇదే మేనిఫెస్టోతో ప్రజల ఆశీస్సులు కోరుతున్న ప్రభుత​ం మీ బిడ్డ ప్రభుత్వమే.

మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బడుల పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి. గోరుముద్ద, అమ్మ ఒడి, పూర్తి ఫీజులతో ఇబ్బంది పడకూడదని జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన.. అక్కాచెల్లెమ్మలు తమ సొంత కాళ్ల మీద నిలబడేందుకు ఆసరా, వైఎస్సార్‌ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలు.. అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్‌ కానుక.  ఇవేవైనా గతంలో జరిగాయా?. రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత బీమా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, పగటి పూట 9గం. ఉచిత కరెంట్‌.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా?

స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ.. ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేస్తం, చేదోడు, లాయర్లకు లా నేస్తం.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశామా?. పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతలా పట్టించుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదేమో. ఆరోగ్యశ్రీని ఉచితంగా రూ.25లక్షలకు విస్తరించడం, గ్రామంలోనే ఫ్యామిలీ క్లినిక్‌, విలేజ్‌ డాక్టర్‌, ఇంటికే సురక్ష.. ఇవేవైనా గతంలో జరిగాయా?..

గతంలో ఎన్నడూ లేనివిధంగా..  ఏ గ్రామానికి వెళ్లినా సచివాలయం కనిపిస్తుంది. 600 రకాల సేవలు అక్కడే అందుబాటులోకి వచ్చాయి. వలంటీర్‌ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్‌ క్లినిక్‌, ఫైబర్‌ గ్రిడ్‌, నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీ, గ్రామంలో ఓ మహిళా పోలీస్‌, అక్కచెల్లెమ్మల సంరక్షణ కోసం దిశా యాప్.. ఇవేప్పుడైనా గతంలో చూశారా?.. ఇవన్నీ 59 నెలల పాలనలో జరిగినవి వాస్తవమా కాదా?..

మరో వంక.. 75 ఏళ్ల ముసలాయన. ‌14 ఏళ్లు సీఎంగా చేశాను అంటాడు. మరి ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటైనా ఆయన చేసిన మంచి గుర్తుకు వస్తుందా?. పిండి కొద్ది రొట్టే సామెత.. పిండి ఎక్కువ ఉంటే.. రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువైతే తగ్గుతాయి. కానీ, పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుది అయితే తాను, తన వారు తినేయడమే స్కీమ్‌గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. పేదల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా చంద్రబాబు వేశారా?.. అదే మీ బిడ్డ జగన్‌.. ఏకంగా రూ.2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా బటన్‌ నొక్కి.. అక్కాచెల్లెమ్మల ఖాతాలోకి నేరుగా వెళ్తున్నాయి. ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు.

చంద్రబాబు హయాంలో ఇదే డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది. దత్తపుత్రుడు, ఈనాడు, టీవీ5, వీళ్ల జన్మభూమి కమిటీల జేబుల్లోకి ఎంత పోయిందో ప్రజలు నిలదీయాలి. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అది ఎలా ఉంటుందంటే.. 2014లో చంద్రబాబు ప్రతీ ఇంటికి పంపిన మేనిఫెస్టో తెలుస్తుంది.

స్వయంగా చంద్రబాబు సంతకం చేసి ముఖ్యమైన హామీలంటూ ప్రతీ ఇంటికి పంపించాడు. ఇందులో ఏ ఒక్కటైనా చేశారా? అని హిందూపురం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రశ్నించారు(లేదు అనే సమాధానం జనం నుంచి వచ్చింది. రుణమాఫీ జరిగిందా?. పొదుపు సంఘాల రుణమాఫీ అన్నారు.. చేశారా?. ఇంటింటికీ ఉద్యోగం.. అది కుదరకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. మరి ఇచ్చారా?. అర్హులకు 3 సెంట్ల స్థలం.. పక్కా ఇళ్లు అన్నారు. కనీసం ఒక్కరికైనా సెంట్‌ స్థలం ఇచ్చారా?.  ప్రతీ నగరంలో హైటెక్‌ సిటీ.. సింగపూర్‌ను మించిన అభివృద్ధి అన్నారు. జరిగిందా?..

మళ్లీ ఈ ముగ్గురు కలిశారు. మళ్లీ మేనిఫెస్టో అంట. మేనిఫెస్టో పేరుతో సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌‌ అంట. ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు అంట. నమ్ముతారా?..

మన బతుకులు బాగుపడాలన్నా. పేదల భవిష్యత్తు మారాలన్నా. లంచాలు లేని అవినీతి రహిత పాలన కొనసాగాలన్నా.. రెండు బటన్‌లు నొక్కాలి.  ఫ్యాన్‌ గుర్తుకే ఓటేయాలి. 175కి 175.. 25 ఎంపీ సీట్లకు 25 ఎంపీ సీట్లు.. ఒక్కటి కూడా తగ్గేది లేదు.. సిద్ధమేనా?..(సిద్ధం అనే బదులు ప్రజల నుంచి వచ్చింది). మంచి చేసిన ఈ ఫ్యాన్‌ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్‌.. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి. ఈ విషయాల్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మీలో ఒకరైన.. మీ బీసీ కులానికి చెందిన దీపిక నిల్చుంది. గెలిపిస్తే.. ఎప్పుడూ మీ దగ్గరే, మీతోనే ఉంటుంది. ఇంకా చాలా మంచి చేయిస్తా.  ఎంపీ అభ్యర్థిగా బోయ శాంత.. అన్ని రకాలుగా మంచి చేస్తుంది. అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది.. ఓటేసి గెలిపించాలని సీఎం జగన్‌ కోరారు. ఎండను లెక్క చేయకుండా నాపై ఆప్యాయతను చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు అని

రాజకీయాలు దిగజారిపోయాయి. భయంకరమైన అబద్ధాలు చూస్తున్నాం. ఇదే చంద్రబాబు తన మనుషులతో అవ్వాతాతలకు వలంటీర్ల ద్వారా పెన్షన్‌లు ఇంటికి రాకుండా చేశారు. ఆ అవ్వాతాతలు తిట్టుకుంటుంటే.. ఆ నెపాన్ని ప్రభుత్వం మీద నెట్టే యత్నం చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?. 

ఈ మధ్య ఇంకో అబద్ధం.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ చేస్తూ దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు. ⁠మీ బిడ్డ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునే వాడు కాదు. దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు నువ్వు మనిషివేనా?. అసలు ఆ చట్టం ఏంటో చంద్రబాబు తెలుసుకోవాలి. 

భూమిమీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ⁠
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుంది. ⁠
భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి. 
కానీ, అలా ఎవరూ కూడా ఎవరి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి రాకూడదు. 
ఇప్పుడు చేస్తున్న సర్వే పూర్తైన తర్వాత ⁠ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. 
ఇలా ఇచ్చే ల్యాండ్ లైటిల్స్కు ఇన్సూరెన్స్కూడా చేస్తుంది. 
రైతులు తరఫున, భూ యజమానుల తరఫున ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది, వారి పక్షాన నిలబడుతుంది. ⁠
ఇది చేయాలంటే  ⁠మొదటగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి కావాలి.  
బ్రిటీష్‌ కాలం తర్వాత.. ఇప్పుడు వందేళ్ల తర్వాత మీ బిడ్డ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎకరాను సర్వే చేయిస్తున్నాడు. ⁠
సరిహద్దు రాళ్లు పెడుతున్నాం.. రికార్డులన్నీ అప్డేట్ చేస్తున్నాం.   ⁠
సబ్ డివిజన్ చేస్తున్నాం. 
రైతన్నలకే పదిలంగా హక్కు పత్రాలు పంపిణీచేస్తున్నాం. 
⁠రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రెవెన్యూ గ్రామాలు…. ఉన్నాయి.   
⁠ఇప్పటివరకు 6 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి అయ్యింది. ⁠

రాబోయే రోజుల్లో పూర్తిగా 17 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తాం. అప్పుడు ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ల భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. ⁠పూర్తి హక్కులతో రికార్డ్స్ అప్డేట్ అవుతాయి, సబ్ డివిజన్లు కూడా అవుతాయి.  ఆ తర్వాత రైతులకు ఇచ్చే సంపూర్ణ హక్కులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది.

ఇంకో అబద్ధం.. ఫిజికల్‌ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు కార్డ్-2 సాఫ్ట్ వేర్ తో 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత భూయజమానులకు డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కార్డ్-2  సాఫ్ట్ వేర్ అమలు జరుగుతోంది. పత్రాలల్లో తప్పులు ఉండకూడదని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఫార్మాట్ తీసుకొచ్చాం.    సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతోంది.

కాబట్టి చంద్రబాబు చేసే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చెబుతున్నారు. ఇవన్నీ నమ్మొద్దు. మోసపోవద్దు. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే.. మీరు మీ బిడ్డకు సైనికులుగా నిలవండి అంటూ సీఎం జగన్‌ ప్రసంగం ముగించారు. 

తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement