అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 28వ రాష్ట్రం టెక్సాస్. దీని రాజధాని ఆస్టిన్. జనాభారీత్యా చూసినప్పుడు ఆస్టిన్ 9.58 లక్షలు. దీని కన్నా ఇదే రాష్ట్రంలోని డల్లాస్ ( 13 లక్షలు ), సాన్అంటానియో ( 14.45 లక్షలు ), హుస్టన్( 23 లక్షలు ) నగరాల్లో ఎక్కువ జనాభా. అయినా చారిత్రక ప్రాధాన్యాన్నిబట్టి రాష్ట్రం మధ్యలో ఉండడం వల్ల ఆస్టినే రాజధాని అయింది. ఆస్టిన్‌లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్టేట్ లెజిస్లేచర్, గవర్నర్, మంత్రుల చాంబర్లు ఉన్నాయి. యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ ఉన్నది ఆస్టిన్‌లోనే.
తప్పక చూడాల్సింది స్పేస్ సెంటర్..
ఈ నగర జనాభాలో మూడింట ఒక వంతు హిస్పానిక్స్, ఆఫ్రికన్ / ఏసియన్ అమెరికన్లు. టెక్సాస్‌లోని అతి పెద్ద నగరమైన హుస్టన్ సిటీలో చూడదగ్గవి ఎన్నోఉన్నాయి. హుస్టన్ సిటీలో నేను మొదటగా చూసినవి అక్వేరియం, చిల్డ్రన్స్ మ్యూజియం లాంటివి. తప్పక చూడాల్సిన సందర్శనీయ స్థలాల్లో గాల్వెస్టన్ సముద్రతీరం, నాసా (NASA) వారి స్పేస్ సెంటర్ వంటివి. ప్రపంచంలో ఏ మూలన ఉన్న విద్యార్థి అయినా.. శాస్త్ర సాంకేతికత మీద, అంతరిక్షం మీద ఆసక్తి ఉంటే.. నాసా సెంటర్ చూడాలనుకుంటారు. లిండన్ బి. జాన్సన్ స్పేస్ సెంటర్ పేరిట హ్యూస్టన్‌లో నిర్మించిన NASA కేంద్రాన్ని స్పేస్‌క్రాఫ్ట్ సెంటర్ అని పిలుస్తారు. ఇక్కడ అంతరిక్షయాన శిక్షణ, పరిశోధన కేంద్రాలున్నాయి. ఈ కేంద్రానికి ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ పేరు పెట్టారు.
తటస్థ ప్రయోగశాల అంటే..
దీన్ని నవంబర్ 1961లో పూర్తి చేశారు. క్లియర్ లేక్ ఏరియాలో 1,620 ఎకరాల్లో 100 భవనాల్లో నిర్మించిన ఈ కేంద్రంలో దాదాపు 3,200 మంది పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మిషన్ కంట్రోల్ సెంటర్.. జెమిని 4 ( అపోలో , స్కైలాబ్ , అపోలో-సోయుజ్ మరియు స్పేస్ షటిల్‌తో సహా ) నుంచి ప్రతి అంతరిక్ష ప్రయాణాన్ని పరిశీలిస్తుంది. అంటే ఒక స్పేస్‌క్రాఫ్ట్ భూమి నుంచి దాని లాంచ్ టవర్‌ను క్లియర్ చేసిన క్షణం నుంచి తిరిగి భూమిపైకి తిరిగి వచ్చే వరకు దాని కంట్రోల్‌ను ఈ కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఈ కేంద్రంలో ఆసక్తి ఉన్న వారికి అర్థమయ్యేలా ఎన్నో ఆకర్షణీయ ఏర్పాట్లు ఉన్నాయి. తటస్థ ప్రయోగశాల.. అంటే అంతరిక్షంలో ఉన్నట్టుగా గాలిలో తేలే వాతావరణాన్ని ఇక్కడ స్వయంగా తెలుసుకోవచ్చు. అలాగే సుమారు 6.2 మిలియన్ యూఎస్ గ్యాలన్ల నీళ్లు ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో వ్యోమగాములు జీరో గ్రావిటీని అనుకరిస్తూ శిక్షణ పొందుతారు. సందర్శకులను స్పేస్ సెంటర్ వరకు అనుమతిస్తారు.
అక్కడ ఉంటే హైదరాబాద్‌లో ఉన్నట్లే..
ఇక టెక్సాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మరొకటి ఉంది. టెక్సాస్‌లో చాలా చోట్ల తెలుగు వాళ్లు కనబడతారు. డాలస్, హ్యూస్టన్, ఆస్టిన్ ఎక్కడయినా.. చూస్తూ ఉంటే హైదరాబాద్‌లో ఉన్నామా అనిపిస్తుంది. హైదరాబాద్ బిర్యానీ అయితే చాలా చోట్ల కనిపిస్తుంది. ఒక్క బిర్యానీనే కాదు, సీజన్‌లో హాలీం కూడా దొరుకుతుంది. ఇరానీ ఛాయ్, సమోసాలు, ఇడ్లీ-దోశ సెంటర్లు.. చూస్తూ ఉంటే సరదాగా అనిపిస్తుంది. ఒక్క భోజనమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో దొరికే ఏ వస్తువు అయినా.. టెక్సాస్‌లో కొనుక్కోవచ్చు. జండూబామ్ నుంచి గోధుమ పిండి వరకు, బియ్యం, నుంచి బాదాంపప్పు వరకు ఏం కావాలన్నా సులువుగా దొరుకుతాయి. కిషోర్ పబరి ఇండియా బజార్, పటేల్ బ్రదర్స్ కిరాణ మార్కెట్, సరిగమప సూపర్‌మార్కెట్, సబ్జీ మండీలతో పాటు బంగారు, వజ్రాల దుకాణాలు బాగానే కనిపిస్తాయి.
ఇండియన్ దుస్తులు పంజాబీ డ్రెస్ నుంచి లుంగీల దాకా అన్నీ దొరుకుతాయి. చాలా చోట్ల సంగీతం, భరత నాట్యం నేర్పే వాళ్లు, యోగా క్లాసులు, తెలుగు భాష, మ్యాథ్స్ క్లాసులు దర్శనమిస్తాయి. డాలస్ ఫోర్ట్ వర్త్ ఏరియాలో మనవాళ్లే టాప్. అన్నట్టు ఇక్కడ మనవాళ్లు అప్పుడే రియల్ ఎస్టేట్‌ను పీక్‌లోకి తీసుకెళ్లారు. అలాగే ఇండియన్ ఈవెంట్స్ కూడా. డాలస్ నగరాన్ని జలవనరుల ఆధారితంగా నిర్మించారు. ట్రినిటీ నది తెల్లరాళ్ళను దాటుతున్న ప్రాంతంలో ఈ సిటీ కట్టారు. నదికి ఇరువైపులా మట్టి గోడలను కట్టి ట్రినిటీ రివర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేశారు. పార్క్‌లు, రెస్టారెంట్లతో వినోద విహార కేంద్రంగా మారింది. డాలస్ మొత్తం నగరం నదీతీరం పక్కనే.. దాదాపు 20 మైళ్ళు సిటీని ఆనుకుని నదీ తీరం ఉంటుంది.
ప్రశాంతంగా రాజధాని
డల్లాస్ ఓ రకంగా హైదరాబాద్ వాతావరణంలా అనిపిస్తుంది. హ్యూస్టన్‌లా గాలిలో తేమ ఉండదు. వేసవిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. హుస్టన్ కాలుష్య వాతావరణంతో పోల్చుకున్నప్పుడు ఆస్టిన్ నాకు ప్రశాంతంగా తోచింది. ఒక రాష్ట్ర రాజధాని ఇంత సింపుల్‌గా ఉండడం గొప్ప విషయమే అనిపించింది. మొత్తం మీద టెక్సాస్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామా.? అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సారి అమెరికా వచ్చినప్పుడు ఓ సారి ఓ లుక్కేయండి. మీరే చెబుతారు.
వేముల ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment