సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం/ వెంకటాచలం/దేవరాపల్లి: మణిపూర్‌లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థుల విషయంలో సీఎం జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. సొంత ఖర్చులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విమానాలను ఏర్పాటు చేసింది. ఒక విమానంలో హైదరాబాద్‌కు, మరో విమానంలో కోల్‌కతాకు తీసుకు వచ్చి, అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకున్నారు. సోమవారం ఉదయం 9.35 గంటలకు మొదటి విమానం (IMF HYD 0935/1235108 ఆంధ్రప్రదేశ్) హైదరాబాద్ బయలుదేరనుంది. అందులో 108 మంది విద్యార్థులను తీసుకురానున్నారు. రెండో విమానం (IMF CCU 1110/122049 ఆంధ్రప్రదేశ్) 11.10 గంటలకు కోల్‌కతా బయలుదేరనుంది. అందులో 49 మంది విద్యార్థులను తీసుకురానున్నారు. మణిపూర్‌లో చిక్కుకున్న మొత్తం 157 మంది విద్యార్థులను ఈ విమానాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
విషయం తెలియగానే ముమ్మర కసరత్తు
మణిపూర్‌లో చెలరేగిన అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన రాష్ట్ర విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్‌కు సహాయం కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఫోన్ కాల్స్ చేసి వివరాలు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు కంట్రోల్ రూమ్‌కు వచ్చిన సమాచారం మేరకు మణిపూర్‌లోని నిట్, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సుమారు 157 మంది రాష్ట్రానికి చెందిన విద్యార్థులు చదువుతున్నట్లు గుర్తించారు. మరోవైపు మణిపూర్‌లోని తెలుగు విద్యార్థులున్న కాలేజీల్లో ఒక్కో కాలేజీ నుంచి ఒక్కో విద్యార్థిని నోడల్ పాయింట్‌గా అధికారులు గుర్తించారు.
వారి ద్వారా ఆయా కాలేజీల్లోని ఏపీకి చెందిన మిగిలిన విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. వీరందరినీ ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి తీసుకొచ్చి, వారి స్వగ్రామాలకు చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి విద్యార్థులను విద్యాలయాల నుంచి ఎయిర్‌పోర్టుకు సురక్షితంగా చేర్చేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతూ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్‌కు ఏపీ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. అలాగే విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్‌కు కూడా లేఖ రాశారు.
మణిపూర్ ప్రభుత్వంతోపాటు కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి సానుకూలంగా స్పందన వచ్చిందని, విద్యార్థులను తరలించడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించిందని అధికారులు వెల్లడించారు. ప్రత్యేక విమానం ఏర్పాటు కాగానే విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్ని గంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు.
ఒకవైపు పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదిస్తూనే ప్రయివేటు విమానయాన సంస్థలతోనూ అధికారులు మాట్లాడుతున్నారు. ప్రత్యేక విమానం ఏర్పాటుకు ఇండిగో విమానయాన సంస్థతో అధికారులు సంప్రదిస్తున్నారు. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూను సోమవారం నుంచి కొన్ని గంటల పాటు సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి ఉదయం 5 గంటల నుంచి 8 వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు ప్రకటించింది.
చురుగ్గా ఏర్పాట్లు : మంత్రి బొత్స
మణిపూర్ నుంచి రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరంలో ఆదివారం సాయంత్రం ఆయన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అక్కడ మన విద్యార్థుల భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, వారికి అండగా నిలిచేందుకు కో ఆర్డినేటర్లను పంపామని చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్ప్ లైన్ (88009 25668, 98719 99055) ఏర్పాటు చేశామన్నారు.
విమానాశ్రయానికి వచ్చేశా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో తాను ఇంటికి బయలుదేరారని, ప్రస్తుతం క్షేమంగా మణిపూర్‌లోని విమానాశ్రయానికి చేరుకున్నానని మణిపూర్‌లో ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పాలిచెర్లపాడుకు చెందిన విద్యార్థి కల్యాణ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం తండ్రి బి.ముసలయ్యకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. కాగా, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాకపల్లి గ్రామానికి చెందిన వేపాడ వెంకటేష్ అనే విద్యార్థి మణిపూర్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాడు.
మణిపూర్‌లోని ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ ఫస్టియర్ చదువుతున్నాడు. తాను చదువుతున్న కళాశాలకు సమీపంలో ఆందోళనకారులు భవనాలకు నిప్పు అంటించారని, ఓ జంటను హతమార్చారని స్థానిక విలేకరులకు ఫోన్ ద్వారా తెలిపాడు. తనతో పాటు యలమంచిలికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి కౌషిక్, మరో 25 మంది ఉన్నారన్నారు. తమను వెంటనే ఏపీకి తరలించే ఏర్పాటు చేయాలని కోరాడు.
చదవండి: చంద్రబాబును భయపెడుతోంది ఇదే..
Comments
Please login to add a commentAdd a comment