పేరు లేకుండా కరపత్రాన్ని ఈనాడులో వేస్తారా?
కొంచెమైనా విలువలున్నాయా?
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఆగ్రహం
చెవిరెడ్డితో కలిసి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, దుస్తుల పంపిణీ
ఒంగోలు సబర్బన్: ‘పచ్చ పత్రికల్లో వెధవ రాతలు, పిచ్చి రాతలు రాస్తున్నారు. ఎవరో వెధవలు పేరు లేకుండా కరపత్రాలు వేస్తే.. ఆ కరపత్రాన్నే ఈనాడు పేపర్‌లో రాస్తారు. అసలు కొంచెం అయినా విలువలున్నాయా’ అని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈనాడు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒంగోలు నగరంలోని రెండో డివిజన్ ముక్తినూతలపాడులో ఇళ్ల పట్టాలు, డాక్యుమెంట్లు లబ్దిదారులకు అందించే కార్యక్రమంలో బాలినేని, ఆయన సతీమణి శచీదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ఒంగోలు నగరంలోని సొంత ఇళ్లు లేని నిరుపేదలకు పట్టాలిచ్చి ఇళ్లు కట్టిద్దామనుకుంటే హైకోర్టుకు వెళ్లి అదే పనిగా ఆపేస్తున్న టీడీపీ నాయకులు, మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.. పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు. అయినా సరే మేం పట్టాలు పంపిణీ చేస్తుంటే టీడీపీ నాయకుల కడుపు మంట అంతా ఇంతా కాదన్నారు. పట్టాల వ్యవహారాన్ని జీర్ణించుకోలేక కొత్త ఎత్తుగడలు వేశారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో తాను పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డికి క్రాస్ ఓటింగ్ చేయిస్తానని టీడీపీ వాళ్లు ఎవరో ఊరు, పేరు లేకుండా కరపత్రాలు వేస్తే.. దానిపై ఈనాడు పత్రికలో కథనంగా రాస్తారా.. అసలు ఈనాడు యాజమాన్యానికి సిగ్గుందా? అంటూ నిలదీశారు.
అందుకే ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా, ఆంధ్రజ్యోతి పత్రికలో షాదీఖానాను ప్రారంభించిన దానినే రెండో సారి ప్రారంభిస్తున్నానని రాశారని, ఇవేం రాతలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు వస్తే వాస్తవాలు తేలుస్తామన్నారు. చెవిరెడ్డి మాట్లాడుతూ నలుగురు చీఫ్ సెక్రటరీలు వచ్చి, సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలిస్తే దొంగ పట్టాలు అంటున్నారంటే.. టీడీపీ నేతలకు మతి పోయిందంటూ ఎద్దేవా చేశారు. వాసన్నకు తనకు అవినాభావ సంబంధం ఉందని చెవిరెడ్డి పేర్కొన్నారు. అనంతరం బాలినేని దంపతులు లబ్దిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు దుస్తులు పంపిణీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment