స్వాతంత్రోద్యమ కాలం నుంచి రైళ్లు ప్రజల జీవితాలతో ముడిపడి ఉండేవి. రోడ్డు మార్గాలు, రవాణా సాధనాలు అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో పేద, మధ్య, ఎగువ తరగతి ప్రజలకు ప్రయాణ సాధనం రైలు మాత్రమే. దీంతో రైల్వే శాఖ నిరంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పనిచేసేది. కాలక్రమేణా ఆధునికత సంతరించుకున్న రైల్వే శాఖ సేవామార్గాన్ని విస్మరించి లాభార్జనే పరమావధిగా పనిచేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి, వాటిని ఎక్స్‌ప్రెస్‌లుగా మర్పు చేయడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయాణం భారంగా మారింది.
ఏలూరు (టూటౌన్): ఒక నాడు అధికంగా కనిపించే ప్యాసింజర్ రైళ్లు క్రమేణా కనుమరుగయ్యాయనే చెప్పవచ్చు. ఎక్కడో కొన్ని మార్గాల్లో మినహా ప్యాసింజర్ రైళ్లు అనేవి కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా విజయవాడ డివిజన్ పరిధిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమండ్రి–విజయవాడ ప్యాసింజర్ రైలు ప్రతి రోజు అప్ అండ్ డౌన్‌గా తిరిగేది. ఇది పేద ప్రజలకు, నిత్యం ప్రయాణించే చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు అక్కరకు వచ్చేది.
ఉదాహరణకు ఏలూరు నుంచి కేవలం రూ.15 చార్జీతో విజయవాడ ప్రయాణం చేసి మళ్లీ సాయంత్రం తిరిగి వచ్చే వెసులుబాటు ఉండేది. అంటే ఒక ప్రయాణికుడు కేవలం రూ.30 ఖర్చుతో ఏలూరు నుంచి విజయవాడ వెళ్లి వచ్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ రైలు ఎక్స్‌ప్రెస్‌గా మార్చి వేశారు. అలాగే చార్జీలు పెద్ద ఎత్తున పెంచి వేశారు. దీంతో గతంలో కిక్కిరిసి ఉండే ప్రయాణికులు ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చిన తరువాత నామమాత్రంగానే కనిపిస్తున్నారు.
కాకినాడ పోర్టు నుంచి విజయవాడ వచ్చే ఫాస్ట్ ప్యాసింజర్ రైలు సైతం నేడు ఎక్స్‌ప్రెస్ రైలుగా రూపాంతరం చెందింది. సుదూర ప్రాంతం నుంచి వచ్చే రాయగడ–గుంటూరు ప్యాసింజర్ సైతం ఎక్స్‌ప్రెస్‌గా మార్చి వేశారు. దీంతో ఈ ప్రాంతం నుంచి విశాఖపట్టణం, శ్రీకాకుళం, రాయగడ ప్రాంతాలకు వెళ్లే వలస కూలీలు, సాధారణ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పాత సీసాలో కొత్త సారా నింపినట్లు గతంలో నడిచే ప్యాసింజర్ రైళ్లనే ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి వేసి పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేస్తున్నారే తప్ప ఆ రైళ్లల్లో అదనంగా ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
స్లీపర్ బోగీలు కుదింపు.. ఏసీ బోగీలు పెంపు
రైళ్లలో ప్రయాణించే జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల విషయంలో రైల్వే శాఖ పట్టించుకోవడం లేదనేది ప్రయాణికుల వాదనగా ఉంది. రద్దీ ఉండే అనేక రైళ్లలో ఏసీ బోగీల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నారు. ఇదే సమయంలో జనరల్, స్లీపర్ బోగీల సంఖ్యను కుదిస్తున్నారు. భువనేశ్వర్ నుంచి బెంగుళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో గతంలో స్లీపర్ బోగీలు 10, ఏసీ బోగీలు 3 ఉండేవి.
తాజాగా స్లీపర్ బోగీలను ఆరుకు తగ్గించి, ఏసీ బోగీలను ఆరుకు పెంచారు. అలాగే విశాఖపట్టణం–హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో గతంలో స్లీపర్ బోగీలు 12 ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య ఏడుకు తగ్గించి, ఏసీ బోగీలను మూడు నుంచి ఏడుకు పెంచారు. ఇలా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ బోగీలను తగ్గించి, ఏసీ బోగీలను పెంచడం వల్ల సాధారణ ప్రజలకు రైలు ప్రయాణం అందని ద్రాక్షలా చేస్తున్నారనేది ప్రయాణికుల వాదనగా ఉంది.
రైళ్ల రద్దుతోనూ తప్పని అవస్థలు
ఇటీవల ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో పాటు ట్రాక్‌ల మెయింట్‌నెన్స్ పేరుతో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. నిత్యం ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండే విజయవాడ–విశాఖపట్టణం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–విశాఖపట్టణం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్, కాకినాడ పోర్టు–విజయవాడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును పలు పర్యాయాలు రద్దు చేస్తుండటంతో వాటిలో ప్రయాణించేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ రెగ్యులర్ ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు నిత్యం ప్రయాణించే రైళ్లే. వీటిని పలు కారణాలతో ఎక్కువ సార్లు రద్దు చేస్తుండటంతో నిత్యం ప్రయాణించే వారి బాధలు వర్ణనాతీతంగా చెప్పుకోవచ్చు.
ఆదాయం బాగుంటేనే గ్రీన్‌సిగ్నల్
పలు కారణాలతో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్న రైల్వే శాఖ అంతరాష్ట్ర సర్విసులను, రైల్వేకు అధిక ఆదాయం తెచ్చే వందేభారత్ వంటి రైళ్ళను మాత్రం యధావిధిగా నడపడంపై సాధారణ ప్రయాణికులు విమర్శలు చేస్తున్నారు. భిన్నమతాలు, భాషలు, ప్రాంతాలను కలిపే రైళ్లు నేడు లాభాలు తెచ్చే మార్గాల వైపే దృష్టి సారించడం శోచనీయమంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్లీపర్ బెర్త్ దొరకడమే కష్టమే
స్లీపర్ క్లాస్ బోగీల సంఖ్యల తగ్గించి వేస్తుండటంతో రిజర్వేషన్ దొరకడమే కష్టంగా మారింది. నెల ముందు రిజర్వేషన్ కోసం ప్రయత్నించినా వెయిటింగ్ లిస్ట్ వస్తోంది. గతంలో నాలుగు రోజుల ముందు ప్రయత్నిస్తే స్లీపర్ క్లాస్‌లో రిజర్వేషన్ దొరికేది. సామాన్య, మధ్యతరగతి ప్రయాణికుల పట్ల రైల్వే శాఖ శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది. – కొరబండి బాబూరావు, సామాజిక కార్యకర్త, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment