UIDAI: Have You Forgotten Your Aadhaar-Linked Mobile Number, Know How To Find Out - Sakshi
Sakshi News home page

ఆధార్‌ లింక్ మొబైల్ నెంబర్ మర్చిపోయారా? డోంట్ వర్రీ.. ఇలా తెలుసుకోండి!

Published Sat, May 6 2023 8:11 AM

Have you forgotten your Aadhaar-linked mobile number know this - Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌కు లింక్‌ అయిన ఈమెయిల్, మొబైల్‌ నంబర్‌ను ఆన్‌లైన్‌లో ధ్రువీకరించే సదుపాయాన్ని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ (యూఐడీఏఐ) ప్రకటించింది. ఆధార్‌ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ నుంచే వీటి ధ్రువీకరణకు అవకాశం కల్పించినట్టు పేర్కొంది. కొంత మంది యూజర్లకు తమ మొబైల్‌ నంబర్లలో ఏది ఆధార్‌తో సీడ్‌ అయిందనే విషయమై అవగాహన ఉండడం లేదని యూఐడీఏఐ గుర్తించింది. దీంతో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆధార్‌ ఓటీపీ వేరొక మొబైల్‌ నంబర్‌కు వెళుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. 

ఇప్పుడు ప్రకటించిన సదుపాయంతో ఆధార్‌కు ఏ మొబైల్‌ నంబర్‌ సీడ్‌ అయిందో తెలుసుకోవచ్చు. ఆధార్‌ అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఎంఆధార్‌ యాప్‌లో ‘వెరిఫై ఈమెయిల్‌/మొబైల్‌ నంబర్‌’ను క్లిక్‌ చేయడం ద్వారా ఈ సదుపాయం పొందొచ్చు’’అని యూఐడీఏఐ పేర్కొంది. ఏదైనా మొబైల్‌ నంబర్‌ సీడ్‌ అవ్వకపోతే అదే విషయాన్ని సూచిస్తుందని, దాంతో మొబైల్‌ నంబర్‌ అప్‌డేషన్‌కు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. 

అప్పటికే మొబైల్‌ నంబర్‌ ధ్రువీకరించి ఉంటే, అదే విషయం తెలియజేస్తుందని వెల్లడించింది. ఆధార్‌ తీసుకునే సమయంలో ఏ నంబర్‌ ఇచ్చామో గుర్తు లేనివారు, సంబంధిత మొబైల్‌ నంబర్‌ చివరి మూడు నంబర్లను నమోదు చేయడం ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ ఈ మెయిల్‌/ మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేసుకోవాలంటే సమీపంలోని ఆధార్‌ కేంద్రాన్ని సందర్శించొచ్చని సూచించింది. 



ఆధార్‌ ధ్రువీకరణ చేపట్టేందుకు 22 సంస్థలకు అనుమతి
కాగా క్లయింట్ల ధ్రువీకరణను ఆధార్‌ ఆధారితంగా నిర్ధారించుకునేందుకు 22 ఆర్థిక సేవల సంస్థలకు అనుమతి లభించింది. ఈ 22 కంపెనీలు ఇప్పటికే మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద రిపోర్టింగ్‌ ఎంటెటీలుగా (కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సమాచారం అందించేవి)గా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

(ఇదీ చదవండి: ఒక్క హాయ్ మెసేజ్.. రూ. 10 లక్షలు లోన్ - ట్రై చేసుకోండి!)

ఇవి తమ క్లయింట్ల గుర్తింపు ధ్రువీకరణను ఆధార్‌ సాయంతో చేపట్టేందుకు అనుమతించినట్టు ప్రకటించింది. ఇలా అనుమతులు పొందిన వాటిల్లో గోద్రేజ్‌ ఫైనాన్స్, అమెజాన్‌ పే (ఇండియా), ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్, టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌ సొల్యూషన్, ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్, మహీంద్రా రూరల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఉన్నాయి. బ్యాంకులు తమ కస్టమర్ల గుర్తింపును ఆధార్‌ సాయంతో ధ్రువీకరించేందుకు ఇప్పటికే అనుమతి ఉంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement