రాష్ట్రంలో పవన విద్యుత్ సామర్థ్యం 9.8 శాతం పెరుగుదల
9009.97 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌లో 4083 మెగావాట్లు పవన విద్యుత్తే
జాతీయ వృద్ధికంటే 1.8 శాతం ఎక్కువతో దేశంలోనే 6వ స్థానం
పవన విద్యుత్‌కు రాష్ట్రంలో అత్యంత అనుకూల వాతావరణం
అతి తక్కువ ధరకే పవన విద్యుత్ లభ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ సంస్కరణల ఫలితంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరుగుతోంది. ఇందులో పవన విద్యుత్‌ది ప్రథమ స్థానం. రాష్ట్రంలో పవన్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 9.8 శాతం పెరిగింది. పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దేశవ్యాప్తంగా 8 శాతం పెరిగితే మన రాష్ట్రంలో అంతకంటే 1.8 శాతం ఎక్కువగా ఉంది.
దేశంలోనే 6వ స్థానంలో ఏపీ నిలిచింది. రాష్ట్రంలో ఉన్న 9009.973 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌లో పవన విద్యుత్ వాటా 4083.37 మెగావాట్లుగా ఉంది. పవన విద్యుత్‌ను పెంచడం ద్వారా దేశంలో మిలియన్లకు పైగా ఉద్యోగాలను సృష్టించవచ్చని గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూఈసీ) పేర్కొంది.
అందుబాటులో టారిఫ్
దీర్ఘకాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్థ్ధికంగా కుదేలవుతున్న డిస్కంలకు ఊరట కలిగిస్తూ ఏపీఈఆర్‌సీ పవన విద్యుత్ ధరలను నిర్ణయించింది. చాలా తక్కువ ధరకు పవన్ విద్యుత్ లభిస్తుంది. పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న డిస్కంలు తొలి పదేళ్లు యూనిట్‌కు రూ. 3.43 చొప్పున చెల్లించాలని ఏపీఈఆర్‌సీ తెలిపింది. 11వ సంవత్సరం నుంచి 20 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.2.64 చెల్లించాలని తెలిపింది.
అనుకూలమని తేల్చిన అధ్యయనాలు
వాతావరణంలో వస్తున్న మార్పులతో ఏపీలో పవన విద్యుత్‌కు అత్యంత అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీయెరాలజీ (పూణె) పరిశోధకులు వెల్లడించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గాలి వేగం తగ్గి, ఏపీలో పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
ఏపీలోని సముద్రతీర ప్రాంతాలపై గాలి సామర్ధ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్’ ప్రయోగాల్లో తేలింది. ప్రస్తుతం రోజుకి 15 మిలియన్ యూనిట్ల నుంచి 20 మిలియన్ యూనిట్ల మధ్య పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment