గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ పథకాలన్నీ సమర్థంగా అమలు
విద్యుత్ ఆదాకు తీసుకున్న చర్యలు సఫలీకృతం
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వెల్లడి
సాక్షి, అమరావతి: విద్యుత్ పొదుపులో ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) ఇటీవల వెల్లడించింది. రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఉజాలా పథకం ద్వారా అందరికీ ఎల్‌ఈడీ బల్బులు అందుబాటులోకి తీసుకురావడం, వీధి దీపాల జాతీయ పథకం, వ్యవసాయ బోర్లకు విద్యుత్ ఆదా పంపు సెట్లు అమర్చడం వంటి ప«థకాలు సమర్థవంతంగా అమలయ్యాయి.
రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, పంచాయతీలలో దాదాపు 29 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తూ ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచింది. అదే విధంగా బీఈఈ ఆధ్వర్యంలో భవనాల్లో భారీ ఎత్తున విద్యుత్ పొదుపు సాధించేందుకు ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) అమలు, రవాణా రంగంలో కాలుష్య నియంత్రణకి ఉద్దేశించిన ఎలక్ట్రిక్ వాహనాల(ఈ–మొబిలిటీ) పథకంలో విద్యుత్ వాహనాలకు రాయితీలు కల్పించడంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇటువంటి చర్యల ద్వారా రాష్ట్రంలో భారీగా విద్యుత్ ఆదాతో పాటు కర్బన ఉద్గారాలు తగ్గినట్లు బీఈఈ తెలిపింది. తద్వారా రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు, విద్యుత్ సంస్థలకు రూ.కోట్లలో ఆర్థిక ప్రయోజనం చేకూరినట్లు వివరించింది.
ఉజాలా పథకంలో ఆదా ఇలా..
దేశ వ్యాప్తంగా వార్షిక విద్యుత్ ఆదా – 47,882 మిలియన్ కిలోవాట్లు
రాష్ట్రంలో వార్షిక విద్యుత్ ఆదా – 2,863 మిలియన్ కిలోవాట్లు ›
దేశంలో వార్షిక విద్యుత్ వ్యయంలో మిగులు– రూ. 19,153 కోట్లు,
రాష్ట్రంలో వార్షిక విద్యుత్ వ్యయంలో మిగులు – రూ.1,145 కోట్లు.
దేశంలో పీక్ డిమాండ్ తగ్గుదల – 9,586 మెగావాట్లు
రాష్ట్రంలో పీక్ డిమాండ్ తగ్గుదల – 573 మెగావాట్లు
దేశంలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 3,87,84,253 టన్నులు
రాష్ట్రంలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 33,18,461 టన్నులు
వీధి దీపాల జాతీయ పథకంలో ఆదా ఇలా..
దేశంలో వార్షిక విద్యుత్ ఆదా – 8,989.66 మిలియన్ కిలోవాట్లు
రాష్ట్రంలో వార్షిక విద్యుత్ ఆదా – 1,980 మిలియన్ కిలోవాట్లు
దేశ వ్యాప్తంగా పీక్ డిమాండ్ తగ్గుదల– 1,498 మెగావాట్లు
రాష్ట్రంలో పీక్ డిమాండ్ తగ్గుదల– 330 మెగావాట్లు
జాతీయ స్థాయిలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 6.19 మిలియన్ టన్నులు
రాష్ట్రంలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 1.36 మిలియన్ టన్నులు
విద్యా సంస్థల్లో ఎనర్జీ క్లబ్‌లు
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఇంధన సామర్థ్య ఫలాలను అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. బీఈఈ ఆర్థిక సహకారంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) ద్వారా రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఇప్పటికే సుమారు 1,000 ఇంధన సామర్థ్య క్లబ్(ఎనర్జీ క్లబ్)లను ఏర్పాటు చేశాం. వీటి ద్వారా విద్యుత్ పొదుపుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’’ – కె విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
విద్యుత్ ఆదాలో తెలుగు రాష్ట్రాల కృషి ప్రశంసనీయం
విద్యుత్ ఆదా, లైఫ్‌మిషన్ అమలులో దక్షిణాది రాష్ట్రాలు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు చేస్తున్న కృషిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) హీరాలాల్ సమారియా కొనియాడారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రజలకు పర్యావరణహిత జీవన విధానాల కోసం మిషన్‌లైఫ్‌లో భాగస్వామ్యం కావాలని సమారియా పిలుపునిచ్చారు. బీఈఈ దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఢిల్లీలో సమారియాతో సోమవారం భేటీ అయ్యారు. ఏపీ సాధించిన విజయాలకు సంబంధించిన సమగ్ర నివేదికను సమారియాకు చంద్రశేఖరరెడ్డి అందించారు. – సీఐసీ హీరాలాల్ సమారియా
Comments
Please login to add a commentAdd a comment