సినిమా రంగంలో కోపతాపాలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు సహజం. ఈ మధ్య నటుడు అజిత్ దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారనే ప్రచారం జరిగింది. అందుకు కారణం చిత్ర కథను అనుకున్న టైంలో రెడీ చేయడంలో దర్శకుడు విఘ్నేశ్‌శివన్ విఫలం అయ్యారన్నదే. దీంతో ఆ చిత్రం నుంచి విఘ్నేశ్‌శివన్‌ను తొలగించారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ చిత్రమే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విడాముయర్చి.
ఇదే పరిస్థితిని దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఎదుర్కొంటున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకుముందు ఈయన చేసిన చిత్రాలన్నీ(లియో చిత్రం మినహా) సంచలన విజయాలను సాధించాయన్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ హీరోగా కూలీ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ నుంచి, టైటిల్ ప్రకటన వరకూ అనూహ్య క్రేజ్‌ను తెచ్చుకున్నాయి. కూలీ చిత్రాన్ని జూన్ రెండవ వారంలో ప్రారంభించనున్నట్లు ప్రచారం జరిగింది.
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రం కోసం రజనీకాంత్ తన 170వ చిత్రం వేట్టైయాన్‌ను త్వరగా పూర్తిచేసినట్లు సమాచారం. అయితే కూలీ చిత్రం అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవడంతో దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌పై రజనీకాంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కూలీ చిత్ర కథనాన్ని మూడు నెలలుగా రాస్తున్నారట. ఇంకా పూర్తికాకపోవడంతో షూటింగ్ ఆలస్యమైందని సమాచారం. ఆయన స్క్రిప్ట్ పక్కాగా పూర్తి అయిన తరువాతనే సెట్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
దీంతో కూలీ చిత్రం జూలైలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment