India To Be Fastest Growing Economy Despite Global Turbulence: RBI Governor - Sakshi
Sakshi News home page

RBI Governor: సవాళ్లు ఉన్నా... ప్రపంచంలో మనమే ఫస్ట్‌

Published Sat, Oct 15 2022 5:34 AM | Last Updated on Sat, Oct 15 2022 11:07 AM

India To Be Fastest Growing Economy Despite Global Turbulence says RBI Governor - Sakshi

ముంబై: భౌగోళిక రాజకీయ సంక్షోభం ఉన్నప్పటికీ భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో మొదట ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు.  సెప్టెంబర్‌ 28 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష సందర్భంగా దాస్‌ ఈ విశ్లేషణ చేశారు. అప్పటి మూడురోజుల సమావేశ మినిట్స్‌ శుక్రవారం విడుదలయ్యాయి.

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచడానికి ఈ సమావేశంలో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కమిటీలో సభ్యురాలు అషీమా గోయల్‌ మాత్రం 35 బేసిస్‌ పాయింట్ల మేర మాత్ర మే పెంపునకు తన అంగీకారం తెలిపారు. ఎకానమీ క్రమంగా పురోగతి చెందుతోందని, ఈ విషయంలో తగిన సానుకూల సంకేతాలు అందుతున్నాయని ఆర్‌బీఐ గవర్నర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

మే తర్వాత 1.9 శాతం అప్‌
సెప్టెంబర్‌ తాజా సమీక్ష పెంపు నిర్ణయంతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా ముప్పావుశాతం అధికం కావడం గమనార్హం. వృద్ధి మందగమనాన్ని నిరోధించడానికి 2019 ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ 2020 మే 22 వరకూ మొత్తం 250 బేసిస్‌ పాయింట్ల రెపో రేటును తగ్గించింది. ఇందులో మహమ్మారి ప్రారంభమైన తర్వాత (2020 మార్చి నుంచి 2020 మే మధ్య) తగ్గింపే 115 బేసిస్‌ పాయింట్లు. అంటే మహమ్మారికి ముందు వరకూ రెపో రేటు 5.15 శాతంగా ఉంది. 

2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు (వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ నిర్ణయం) కొనసాగింది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్‌బీఐ కొనసాగిస్తూ వచ్చింది.  నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి సారి ఆర్‌బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. జూన్‌ 8వ తేదీ, ఆగస్టు 5వ తేదీన  50 బేసిస్‌ పాయింట్ల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ నిర్ణయంతో రెపో మే తర్వాత 1.9 శాతం పెరిగినట్లయ్యింది.  దీనితో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపును షురూ చేశాయి.  

పెంపు దిశగా తప్పని అడుగులు
2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం గాడిన పడుతూ, అప్పట్లో వ్యవస్థలోకి విడుదలైన అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోడానికి చర్యలు ప్రారంభించే తరుణంలోనే పలు దేశాల వాణిజ్య యుద్ధం ప్రతికూలతను తీసుకువచ్చింది. ఈ సమస్య పరిష్కారంలోపే ప్రపంచంపై కోవిడ్‌–19 విరుచుకుపడింది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికాసహా పలు దేశాలు మరింత సరళతర వడ్డీరేట్లకు మళ్లాయి.

వ్యవస్థలో ఈజీ మనీ ప్రపంచ దేశాల ముందుకు తీవ్ర ద్రవ్యోల్బణం సవాలును తెచ్చింది. దీనికితోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. దీనితో ధరల కట్టడే లక్ష్యంగా అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడ్‌సహా ప్రపంచ దేశాలు కీలక రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఇక ఇదే సమయంలో భారత్‌లో ఒకవైపు ద్రవ్యోల్బణం సవాళ్లు, మరోవైపు అమెరికా వడ్డీరేట్ల పెంపుతో ఈక్విటీల్లోంచి వెనక్కు వెళుతున్న విదేశీ నిధులు వంటి ప్రతికూలతలు ఎదురవడం ప్రారంభమైంది.

  రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 2–6 శాతం మధ్య కట్టడి చేయాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తుండగా, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆగస్టు వరకూ వరుసగా ఎనిమిది నెలలు   (జనవరిలో 6.01 శాతం,  ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం, ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతం, మేలో 7.04 శాతం, జూన్‌లో 7.01 శాతం, జూలైలో 6.71 శాతం, ఆగస్టులో 7 శాతం)  ఈ రేటు అప్పర్‌ బ్యాండ్‌ దాటిపోవడం ప్రారంభమైంది. దీనితో  భారత్‌ కూడా కఠిన ఆర్థిక విధానంవైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రెపో రేటు 6.5 శాతం వరకూ వెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.  

కీలక నిర్ణయాల్లో కొన్ని...
► 2022–23లో ఆర్థిక వృద్ధి అంచనా 7 శాతంకాగా, సెప్టెంబర్‌ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. జూన్‌ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే.  
► రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనా  వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement