RBI Monetary Policy Highlights: RBI Hikes Repo Rate By 50 Basis Points, Details Inside - Sakshi
Sakshi News home page

RBI Monetary Policy Highlights: రుణాలు మరింత భారం!

Published Sat, Oct 1 2022 4:42 AM

RBI Monetary Policy: RBI hikes repo rate by 50 basis points - Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) మరో 50 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీంతో ఈ రేటు 5.9 శాతానికి చేరింది. 2019 ఏప్రిల్‌ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. కేంద్రం నిర్దేశిస్తున్న 6% రిటైల్‌ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా 4 సార్లు ఆర్‌బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4%గా ఉన్న రెపో 190 బేసిస్‌ పాయింట్లు పెరిగింది. మరింత పెరగవచ్చని సైతం తాజాగా ఆర్‌బీఐ సంకేతాలిచ్చింది.  తాజా పెంపుతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా ముప్పావుశాతం అధికం కావడం గమనార్హం.

జీడీపీ అంచనాలు కట్‌...
వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నదే రెపోరేటు ఇన్‌స్ట్రుమెంట్‌ ఉద్దేశ్యం. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలు మరింత భారం కానున్నాయి.  కాగా, పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం 2022–23లో  6.7 శాతంగా ఉంటుందన్న తన అంచనాలను యథాథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ పాలసీ పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు విషయంలో మాత్రం అంచనాను కిత్రం 7.2 శాతం నుంచి 7 శాతానికి ఆర్‌బీఐ కుదించింది.  

పాలసీ ముఖ్యాంశాలు...
► 2022–23లో ఆర్థిక వృద్ధి అంచనా 7% కాగా, సెప్టెంబర్‌ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. జూన్‌ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. 
► రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతం కాగా, క్యూ2, క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1%, 6.5%, 5.8 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది.
► డాలర్‌ మారకంలో రూపాయి విలువపై జాగ్రత్తగా పరిశీలన. సెప్టెంబర్‌ 28 వరకూ ఈ ఏడాది 7.4 శాతం పతనం. రూపాయిని నిర్దిష్ట మారకం ధర వద్ద ఉంచాలని ఆర్‌బీఐ భావించడం లేదు. తీవ్ర ఒడిదుడుకులను నిరోధించడానికి ఆర్‌బీఐ చర్యలు ఉంటాయి. వర్ధమాన దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి విలువ బాగుంది. 
► ఏప్రిల్‌లో 606.5 బిలియన్‌ డాలర్లు ఉన్న భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు, సెప్టెంబర్‌ 23 నాటికి 537.5 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.   డాలర్‌ బలోపేతం అమెరికన్‌ బాండ్‌ ఈల్డ్‌ పెరగడం వంటి మార్పులే కావడం గమనార్హం.
► రూపాయిలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిష్కరించుకోవడానికి నాలుగైదు దేశాలు, అనేక బ్యాంకుల నుండి మంచి స్పందన లభిస్తోంది.
► 2022–23లో బ్యాంకింగ్‌ రుణ వృద్ధి 16.2 శాతంగా ఉంటుందని అంచనా. 
► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్‌ 5 నుంచి 7 వరకు జరుగుతుంది.  


నేటి నుంచి టోకెనైజేషన్‌
దాదాపు 35 కోట్ల కార్డుల వివరాలు, లావాదేవీల గోప్యత లక్ష్యానికి సంబంధించిన టోకెనైజేషన్‌ వ్యవస్థ అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టీ రవి శంకర్‌ తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, ఆగస్టు నాటికి వ్యవస్థలో 101 కోట్ల డెబిట్, క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. సెప్టెంబర్‌లో దాదాపు 40% లావాదేవీల టోకెనైజేషన్‌ జరిగింది. వీటి విలువ దాదాపు రూ.63 కోట్లు. టోకెనైజేషన్‌ వ్యవస్థలో చేరడాన్ని తప్పనిసరి చేయకపోవడం వల్ల ఈ వ్యవస్థ వేగంగా ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొందని డిప్యూటీ గవర్నర్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement