సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో గత నెల 31న జరిగిన ఓ డ్రగ్ పార్టీపై దాడి చేశారు. ఆ ఫ్లాట్‌లో కనిపించిన సీన్... ఇటీవల విడుదలైన ‘బేబీ’ సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్, టీఎస్ నాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ అన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్‌కు నోటీసులు ఇచ్చామని, వారు తమ ఎదుట హాజరై వివరణ ఇచ్చారని గురువారం చెప్పారు.
అందులో ఉన్న సీన్లపై తాము చెప్పిన తర్వాతే సినిమాలో వార్నింగ్ నోట్ పెట్టారని, అప్పటివరకు అలాంటిది కూడా లేదని అన్నారు. ఇలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలను సినిమాల్లో పెట్టవద్దని ఆనంద్ హితవు పలికారు. వీటి ద్వారా స్ఫూర్తి పొంది అనేక మంది యువకులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గతంలోనూ ఇలాంటి సీన్లతో కూడిన సినిమాలు వచ్చాయని, అయితే వాటిని ఎవరూ పట్టించుకోలేదని చెప్పిన ఆనంద్.. ఇకపై ఈ తరహాలో ఉన్న వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
‘టాలీవుడ్ లింకులు ఉన్న డ్రగ్స్ కేసు’లో పరారీలో ఉన్న సూర్య.. స్నాట్ అనే పేరుతో పబ్ నిర్వహిస్తున్నాడని, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను స్నాటింగ్ ప్రక్రియ ద్వారా వినియోగిస్తారని చెప్పారు. దీన్ని బట్టి సూర్య తన వద్ద మాదకద్రవ్యాలు లభిస్తాయని అర్థం వచ్చేలా తన పబ్‌కు పేరు పెట్టాడని భావించాల్సి వస్తోందని ఆనంద్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్‌ను ప్రేరేపించే సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరతామన్నారు.
ఎన్సీబీ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారని, దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. తాము ఇటీవల కాలంలో 33 మంది నైజీరియన్లను అరెస్టు చేయగా, వారిలో 18 మంది బెంగళూరులో స్థిరపడిన వారిగా తేలిందన్నారు. టీఎస్ నాబ్ సేవల విస్తరణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment