తాటాకులు ఇప్పటికీ మన పల్లెల్లో విస్తారం. కానీ తాటాకు విసనకర్రలు పోయాయి. తాటాకు చాపలు, తాటాకు బొమ్మలూ పోయాయి. ‘మన కళ ఇది. మన పిల్లలకు బార్బీ కంటే తాటాకు బొమ్మలే నచ్చుతాయి’ అంటుంది కోయంబత్తూరు మోహనవాణి. తాటాకు కళను పిల్లలకు నేర్చించి వారికై వారు తయారు చేసుకున్న బొమ్మలతో ఆడుకునేందుకు ప్రోత్సహిస్తోంది. స్త్రీలు సరిగా నేర్చుకుంటే ఉపాధి మార్గం అని కూడా చెబుతోంది.
మన దేశంలో పశ్చిమ బెంగాల్‌లో తాటాకుతో చేసే బొమ్మలకు, బుట్టలకు చాలా డిమాండ్ ఉందని చాలా కొద్ది మందికే తెలుసు. విశాఖ జిల్లా నక్కపల్లి, నర్సీపట్నంల నుంచి శ్రేష్టమైన తాటాకు గ్రేడింగ్ అయ్యి, రంగులు అద్దుకుని కోల్‌కతాకి ఎగుమతి అవుతుంది. అక్కడ వాటితో బొమ్మలు, బుట్టలు తయారు చేసి అమ్ముతున్నారు. పెద్ద ఆదాయం. విశాఖలో జరుగుతున్నట్టుగా మిగిలిన జిల్లాల్లో జరగడం లేదు.
తాటాకులు మన తొలి కాగితాలు. తాటాకుతో ఒకప్పుడు ఇళ్లు కప్పేవారు, పందిళ్లు వేసేవారు, చాపలు, బుట్టలు, బొమ్మలు తయారు చేసేవారు. ఇప్పుడు ఆ కళంతా ఎవరూ సాధన చేయడం లేదు. దానిని అందరికీ నేర్పించాలని కూడా అనుకోవడం లేదు. కాని తమిళనాడులో 34 ఏళ్ల మోహనవాణి అనే మహిళ పట్టుబట్టి తాటాకు బొమ్మల కళను అందరికీ నేర్పుతోంది. దక్షిణాదిలో విస్తారంగా ఉండే తాటి చెట్టు నుంచి ఆకు సేకరించి బొమ్మలు చేసి ఉపాధి పొందవచ్చంటున్నది.
ఎనిమిదేళ్ల వయసులో..
మోహనరాణిది కోయంబత్తూరు. ఆమెకు ఎనిమిదేళ్లు ఉండగా మేనమామ ఆమెకు తాళపత్ర గ్రంథం చూపించాడు. రోజూ చూసే తాటాకుల మీద పుస్తకమే రాయవచ్చా అని మోహనరాణికి ఆశ్చర్యం వేసింది. తాటాకులతో చిన్న చిన్న బొమ్మలు చేసే ప్రయత్నం చేసిందిగాని పూర్తిగా రాలేదు. అప్పటినుంచి తాటాకు బొమ్మలు చేయాలనే కోరిక ఉండిపోయింది. ఐదేళ్ల క్రితం మదురైలో తాటాకు బొమ్మలు నేర్పించే వర్క్‌షాప్ జరుగుతున్నదని తెలిసి హాజరయ్యింది. మూడు రోజుల ఆ వర్క్‌షాప్‌లో తాటాకు బొమ్మలు చేయడం నేర్పించారు.
పచ్చి ఆకుతో నేరుగా, ఎండిన ఆకైతే నీటితో తడిపి మెత్తగా చేసుకుని అప్పుడు బొమ్మలు చేయాలని తెలిసింది. ఎలా కత్తిరిస్తే ఏ షేప్ వస్తుందో అర్థమయ్యాక తన ఊహ కలిపి బొమ్మలు తయారు చేసింది. వాటికి పూసలు జత చేయడంతో స్పష్టమైన బొమ్మలు తయారయ్యాయి. మోహనవాణి తాటాకులతో చీమలు, చిలుకలు, నెమళ్లు, చేపలు... ఇలా చాలా బొమ్మలు చేస్తుంది. వాటితో గట్టి బుట్టలు కూడా అల్లుతుంది.
పిల్లల లోకం
అయితే ఈ బొమ్మలు తర్వాతి తరాలకు అందాలని నిశ్చయించుకుంది మోహనవాణి. కోయంబత్తూరులోని స్కూళ్లకు వెళ్లి తాటాకు బొమ్మలు నేర్పించింది. పిల్లలు ఎంతో హుషారుతో బొమ్మలు నేర్చుకున్నారు. కొత్త బొమ్మలు చేశారు. ‘ఆశ్చర్యం ఏమిటంటే మీరు తయారు చేసిన బొమ్మలతో కథ కల్పించి చెప్పండి అనంటే వాళ్లు చాలా విచిత్రమైన కథలు చెప్పారు. పిల్లలకు ఇదెంతో మానసిక వికాసం అనిపించి తరచూ అనేక స్కూళ్లకు వెళ్లి వర్క్‌షాపులు నిర్వహించి ఈ కళను నేర్పుతున్నాను’ అంది మోహనవాణి.
ప్లాస్టిక్‌కు దూరం
తాటాకు బొమ్మలు పర్యావరణ హితమైనవి. పిల్లల్ని, పర్యావరణాన్ని ప్లాస్టిక్ నుంచి దూరంగా ఉంచుతాయి. అంతేకాదు తాటాకు బొమ్మలు దేశీయమైనవి. మనదైన కళ కావడం వల్ల పిల్లలు కృత్రిమ పాశ్చాత్య బొమ్మలతో కాకుండా అమాయకమైన ఈ బొమ్మలతో ఎక్కువ ఆనందం పొందుతారు. ‘పర్యావరణ స్పృహ పెరిగింది కాబట్టి తాటాకు బుట్టలను, బాక్సులను, విసనకర్రలను చాలామంది కొంటున్నారు. మహిళలు ఈ కళను నేర్చుకుంటే అతి తక్కువ పెట్టుబడితో మంచి ఉపాధి పొందవచ్చు’ అంటోంది మోహనవాణి.
ఆమె ఇప్పుడు ముంబైలోని కొన్ని స్కూళ్లకు వెళ్లి ఈ విద్య నేర్పుతోంది. మిగిలిన రాష్ట్రాలలో కూడా చాలా స్కూళ్లు ఆమెను ఆహ్వానిస్తున్నాయి. టీచర్లు ఈ క్రాఫ్ట్ నేర్చుకుంటే పిల్లలకు నేర్పించవచ్చని టీచర్లకు తాటాకు కళ నేర్పుతోంది మోహనవాణి. ‘తాటాకు బొమ్మలు చేయడం పెద్ద స్ట్రెస్‌బస్టర్. మీ ఒత్తిడి దూరం చేసుకోవడానికైనా తాటాకు అందుకుని బొమ్మలు చేయండి’ అంటోంది మోహనవాణి.
Comments
Please login to add a commentAdd a comment