కరోనా కష్టకాలంలో అర్ధరాత్రి అపరాత్రి ఫోను మోగితే గుండె జల్లుమనేది! కరోనా పేషెంట్లకు బెడ్లు కావాలంటూ నా నియోజక వర్గం నుంచి బాధితులు ఫోన్లు చేస్తూ ఉండేవారు. బెడ్ల కోసం ప్రభుత్వాసుపత్రికి అర్ధ రాత్రి పరుగులు తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వరదలా కరోనా పేషెంట్లు వస్తూ ఉన్నా... ప్రభుత్వాసుపత్రులు నిండిపోతున్నా... అదనంగా బెడ్లు ఏర్పాటు చేస్తూ... ప్రాణాలు చేతబట్టుకొని వస్తున్న పేషెంట్లను కాపాడటానికి సిబ్బంది రాత్రీ, పగలూ తేడా లేకుండా కష్టపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతరాయంగా కరోనా పేషెంట్లకు సేవలు అందడం వెనక పాలకుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి, తపన ఉన్నాయి. పాలకుడు చిత్తశుద్ధితో, నిజాయితీగా కష్టపడితే, ప్రజ లను ప్రేమిస్తే... విపత్కర పరిస్థితులను అధిగమించే శక్తి, సామర్థ్యం వ్యవస్థలకు వస్తుందని నిరూపించిన సందర్భం అది!
గత ప్రభుత్వపు నిర్లక్ష్యపు జబ్బుతో చేష్టలుడిగిన ప్రభుత్వ ఆసుపత్రులకు జగన్ ముఖ్యమంత్రి కాగానే కాయకల్ప చికిత్స మొదలు పెట్టారు. ఫలితంగానే పేద ప్రజల ప్రాణాలను కరోనా విలయం నుంచి కాపాడటంలో ప్రభుత్వ ఆసుపత్రులు సఫలీకృతం అయ్యాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సరైన ప్రాధమ్యాలు గుర్తించడంలోనే సగం విజయం ఉంటుంది. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రులకు కాయకల్ప చికిత్స, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ‘ఆరోగ్య శ్రీ’కి జవసత్వాలు కల్పించడం వంటివి సంక్షేమ పాలనకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా మూడేళ్లు పూర్తవుతోంది. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన ఫలాలు అందుకుంటున్న విషయం అనుభవంలోకి వచ్చింది. చేతిలో మంత్రదండం ఉన్నట్లుగానే ముఖ్యమంత్రి జగన్... సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథ కాలు అందిస్తున్నారు. అంతులేని చిత్తశుద్ధి, పరిమితులు లేని నిజాయితీ ఉంటే తప్ప ఇచ్చిన హామీలన్నింటినీ... కరోనా విపత్తు ఉరిమినా, తరిమినా అమలు చేయడం అసాధ్యం కాదని ప్రజలందరికీ స్పష్టంగా అవగత మయింది.
పేదరికంలో అట్టడుగున ఉన్న ఆఖరి వ్యక్తి ఆకలి తీర్చే ఆత్మగౌరవ జెండానూ, అజెండానూ స్వయంగా నిర్దేశించుకొని, వాటి అమలుకు వేస్తున్న ప్రతి అడుగు లోనూ సాహసం ప్రస్ఫుటంగా ఈ మూడేళ్లుగా కనిపిస్తూనే ఉంది. పిల్లలను బడికి పంపే తల్లులకు ‘అమ్మ ఒడి’, కాడికట్టి మేడిపట్టి ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకు అండగా ‘రైతు భరోసా’, పేద పిల్లల బంగారు భవిష్యత్‌కు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, ఇప్పటికే ఉన్నత చదువులకు వచ్చిన విద్యార్థులకు మెరుగైన ఉపాధి, నైపుణ్యా భివృద్ధికి చర్యలు, కుటుంబాన్ని పోషించుకుంటూ మరింత వేగంగా అభ్యున్నతి వైపు అక్కాచెల్లెమ్మలు అడుగులు వేయడానికి ‘వైఎస్సార్ ఆసరా’, మహిళా సాధికారతకు దారి చూపే పలు సంక్షేమ కార్యక్రమాలు... ఇవన్నీ ప్రజలను పేదరికం నుంచి బయట పడవేయడమే లక్ష్యంగా మూడేళ్ల పాలనలో అమలు చేయడం జరిగింది.
ఇదే లక్ష్యంతో ‘నవరత్నాల’నూ అమలు చేశారు. కులం, మతం, పార్టీ, తన, మన... వంటి ఎలాంటి భేద భావం లేకుండా అర్హతే ప్రామా ణికంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడం ‘సుపరిపాలన’కు సజీవ సాక్షాలుగా నిలిచేవే. కత్తిరింపు ల్లేకుండా అర్హులెవరైనా మిగిలిపోతే వెతికి మరీ వారికి పథకాలు అందించాలంటే... ‘పాలకుడికి ఎంత విశాల హృదయం ఉండాలో కదా!’ అని మనకు అనిపించకమానదు. పేదలు, బడుగు బలహీన వర్గాల ఈతి బాధల పట్ల ఎంతో సహానుభూతి, ఒళ్లంతా కరుణ నిండి ఉంటే తప్ప... పాలనలో సానుభూతి, సహాను భూతి... ఇలాంటి వాటికి స్థానం ఉండదు. పైసా అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, అత్యంత పారదర్శకతతో నగదు బదిలీ ద్వారా మూడేళ్లలో దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల సొమ్ము పేదల ఖాతాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేశారు.
ఊరికి కొత్త రూపు
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో మూడేళ్లలో పాతిక వేల శాశ్వత భవనాలు కొత్తగా వెలిశాయి. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు... ఇలా పలు భవనాలు ఆస్తులుగా గ్రామాల్లో మూడేళ్ల సుపరిపాలనకు నిదర్శనంగా నిలబడ్డాయి. కుగ్రా మంలో ఉన్న వారు సైతం సొంత ఊరు దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా సచివాలయాల ద్వారా సేవలు పొందుతున్నారు. వలంటీర్లు, సచివాలయాల ద్వారానే 4 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది. (క్లిక్: 'పల్లె' వించిన పట్టణీకరణ!)
మహిళల భద్రతకు దిక్సూచిగా ‘దిశ’ నిలిచింది. ‘దిశ’ స్ఫూర్తితో దర్యాప్తు, న్యాయస్థానం విచారణలో వేగం పెరిగింది. తప్పు చేసిన వారికి కొద్ది రోజుల్లోనే శిక్షలు పడటం ఇటీవల కొన్ని కేసుల్లో చూశాం. ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగులోనూ అక్కాచెల్లెమ్మల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన, సాధికారత తెచ్చి పెట్టాలనే లక్ష్యం ప్రస్ఫుటమవుతోంది. జనరల్ స్థానా ల్లోనూ మహిళలకు పదవులు ఇచ్చి అధికారాన్ని అప్పగించడం ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనం. జనరల్ స్థానాల్లో బీసీలకూ అవకాశం ఇచ్చి బలహీన వర్గాలను అధికారానికి దగ్గర చేర్చి సాధికారత అందించే ప్రయత్నం చరిత్రలో నిలిచి ఉండే అంశం. మూడేళ్ల సుపరిపాలనకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సాక్షులే! (క్లిక్: మూడేళ్లలో సమూల మార్పు.. కొత్త చరిత్ర!)
- కైలే అనిల్‌కుమార్
వ్యాసకర్త శాసన సభ్యుడు, పామర్రు, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment