Startup-20 Engagement Group: India Aims to Help Startups in G20 Nations - Sakshi
Sakshi News home page

జీ20 అభివృద్ధికి మన స్టార్టప్‌ మార్గదర్శనం

Published Tue, Dec 13 2022 1:54 PM | Last Updated on Tue, Dec 13 2022 3:24 PM

Startup 20 Engagement Group: India Aims to Help Startups in G20 Nations - Sakshi

ఆవిష్కరణ–ఆధారిత ఆర్థిక పునరుద్ధరణ, పునర్నిర్మాణం, వృద్ధికి స్టార్టప్‌లు ఇంజిన్‌గా మారాయి. ప్రతి దేశంలో పెరుగుతున్న అవసరాలు, భవిష్యత్తు విలువ ఆధారిత పంపిణీ నిర్మాణంలో  స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 90 ట్రిలియన్ల డాలర్లుగా ఉంది. దీనిలో స్టార్టప్‌ ఆర్థిక వ్యవస్థ విలువ  దాదాపు 3 ట్రిలియన్ల డాలర్ల వరకు ఉంది. స్టార్టప్‌ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా  వృద్ధి చెందుతోంది.

ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వేగంగా మారుతున్న పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడానికి వినూత్న ఆవిష్కరణలు సహక రిస్తాయి. పరిస్థితులకు తగిన ఆవిష్కరణలను అందిం చగల సామర్థ్యం కేవలం స్టార్టప్‌లకు మాత్రమే ఉంది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో స్టార్టప్‌ల ప్రాధాన్యం, సామర్థ్యం స్పష్టంగా వెలుగులోకి వచ్చాయి. స్టార్టప్‌ల పాత్ర ప్రాణాలను రక్షించడంలో మాత్రమే కాకుండా తిరిగి ఆర్థిక చైతన్యం సాధించడానికి ఉపయోగపడింది. సుస్థిర ఆర్థిక లక్ష్యాల సాధనలో ఆర్థిక వ్యవస్థలకు స్టార్టప్‌లు సహాయం చేస్తున్నాయి. దేశాలతో సంబంధం లేకుండా సహకారం, ఆవిష్కరణల రంగంలో స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. దేశాల మధ్య సహకారం, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లు వేదికలనూ, సాధనాలనూ అందిస్తున్నాయి. ఉద్యోగాల కల్పన, సాంకేతిక పురోగతి, దీర్ఘకాలిక వృద్ధి, సంక్షోభ నిర్వహణ పరంగా స్టార్టప్‌లు ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషించనున్నాయి.  

స్టార్టప్‌–20 ఎంగేజ్‌మెంట్‌ గ్రూప్‌ ఏర్పాటుకు ‘జీ20’కి అధ్యక్షత వహిస్తున్న భారతదేశం చొరవ తీసుకుంది. స్టార్టప్‌లకు సహకారం అందించడం, స్టార్టప్‌లు, కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, ఇన్నోవేషన్‌ ఏజెన్సీలు, ఇతర కీలక పర్యావరణ వ్యవస్థ వాటాదారుల మధ్య సహకారం పెంపొందించడానికి స్టార్టప్‌–20 ఎంగేజ్‌ మెంట్‌ గ్రూప్‌ కృషి చేస్తుంది. భారతదేశ స్టార్టప్‌ రంగంలో నేడు 107 యునికార్న్‌లు, 83,000 కంటే ఎక్కువ గుర్తింపు పొందిన స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. వీటి అభివృద్ధికి అవసరమైన ఆవిష్కరణ రంగం సమర్థంగా పనిచేస్తోంది. భారతదేశ స్టార్టప్‌ రంగం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్‌ రంగంగా గుర్తింపు పొందింది.

కొత్తగా ప్రారంభించిన స్టార్టప్‌–20 ఎంగేజ్‌మెంట్‌ గ్రూప్‌ ద్వారా జీ20 దేశాలలో వ్యూహాత్మక సహకారం ద్వారా వినూత్న స్టార్టప్‌లకు సహకారం అందించి ప్రపంచంలో సమగ్ర స్టార్టప్‌ వ్యవస్థ అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది. జీ20లో సభ్యత్వం ఉన్న ప్రతి దేశం అభివృద్ధికి అవసరమైన సౌకర్యాల కల్పనకు స్వయంగా చర్యలు అమలు చేస్తోంది. స్టార్టప్‌–20 ఎంగే జ్‌మెంట్‌ గ్రూప్‌ అన్ని సభ్య దేశాలతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం ఉన్న రంగాల్లో సభ్య దేశాల మధ్య సహకారం, సమ న్వయం సాధించి ఆర్థిక సహకారానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తుంది. 

ప్రారంభ సంవత్స రంలో అమలు చేయాల్సిన మూడు ప్రాధాన్యతా అంశాలను ఎంగేజ్‌మెంట్‌ గ్రూప్‌  గుర్తించింది: 
1. పునాదులు, కూటముల ఏర్పాటు : జీ20 ఆర్థిక వ్యవస్థల అంతటా స్టార్టప్‌లకు బహుళ నిర్వచనాలు ఉన్నాయి. మొదటి ప్రాధాన్యతా అంశంగా ఏకాభి ప్రాయం ద్వారా స్టార్టప్‌ అంటే ఏమిటి అనే అంశానికి స్పష్టత నివ్వాలనీ, దీనికి సంబంధించిన పదజాలం రూపొందించాలనీ ఎంగేజ్‌మెంట్‌ గ్రూప్‌ గుర్తించింది. స్టార్టప్‌ల కోసం హ్యాండ్‌ బుక్‌ను సిద్ధం చేయడానికి ఏకాభిప్రాయ ఆధారిత నిర్వచనాలు, పదజాలం అంచనా వేయబడతాయి. అంతేకాకుండా,  జీ20 ఆర్థిక వ్యవస్థల్లో స్టార్టప్‌ పర్యావరణ వ్యవస్థ వాటాదారుల మధ్య ప్రపంచ సహకారం పెంపొందించడానికి వ్యవస్థను రూపొందించడం, దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం తన మొదటి లక్ష్యంగా స్టార్టప్‌– 20 ఎంగేజ్‌మెంట్‌ గ్రూప్‌ పెట్టుకుంది.

2. ఆర్థిక అంశాలు: ఆర్థిక అంశాలను రెండవ ప్రాధాన్యతా రంగంగా స్టార్టప్‌–20 ఎంగేజ్‌మెంట్‌ గ్రూప్‌ గుర్తించింది. స్టార్టప్‌లకు సులువుగా నిధులు అందేలా చేయడం, సహకారం అందించడం, నూతన అవకా శాలు గుర్తించడం లాంటి అంశాలకు రెండవ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. 

3. సమగ్ర, సుస్థిర అభివృద్ధి: కీలకమైన ఎస్డీజీ  (సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు) వ్యత్యాసాలను తగ్గించి వేగంగా అభివృద్ధి సాధించడానికి అవసరమయ్యే పరిస్థితులు కల్పించే అంశాన్ని స్టార్టప్‌–20 ఎంగేజ్‌ మెంట్‌ గ్రూప్‌ మూడవ ప్రాధాన్యతా రంగంగా గుర్తిం చింది. దీనిలో భాగంగా ఒకే విధమైన ప్రయోజనాల కోసం వివిధ దేశాల్లో పనిచేస్తున్న సంస్థల మధ్య సమన్వయం (మహిళా పారిశ్రామికవేత్తలు లాంటివి) సాధించే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. జీ20 దేశాల్లో స్టార్టప్‌ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న తన లక్ష్యాన్ని సాధించడానికి స్టార్టప్‌–20 కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. స్టార్టప్‌ 20 దీనిలో భాగంగా 6 కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రారంభ కార్యక్రమం 2023 జనవరి 28న (హైదరాబాద్‌) జరుగుతుంది. శిఖరాగ్ర సదస్సు 2023 జూలై 3న (గురుగ్రామ్‌లో) జరుగుతుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా కార్యక్రమాలు జరుగుతాయి. అదనంగా, భారతదేశ స్టార్టప్‌ రంగం సాధించిన అభివృద్ధిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొని రావడానికి భారీ  స్టార్టప్‌ షోకేస్‌ నిర్వహించాలన్న ఆలోచన కూడా ఉంది.

జీ20 సభ్య దేశాలు ఆమోదించి అంగీకరించే విధాన ప్రకటనను  స్టార్టప్‌–20 ఎంగేజ్‌మెంట్‌ గ్రూప్‌ సిద్ధం చేసి అందజేస్తుంది. చర్చల ద్వారా మార్గ దర్శకాలు, ఉత్తమ విధానాలు, వ్యవస్థలు, ముఖ్యమైన తీర్మానాల లాంటి అంశాలకు సంబంధించి స్టార్టప్‌–20 ప్రచురణలు తీసుకు వస్తుంది. స్టార్టప్‌ రంగ అభివృద్ధికి దోహదపడే విధంగా ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌’ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన భారతదేశ పరిశీ లనలో ఉంది. అభివృద్ధి, సమన్వయ కార్యక్రమాలకు  ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌’ వేదికగా పనిచేస్తుంది.  

జీ20 అధ్యక్ష హోదాలో భారతదేశం ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే స్ఫూర్తిని ప్రపంచానికి అందించాలని భావిస్తోంది. అదే స్ఫూర్తితో, స్టార్టప్‌ 20 ఎంగేజ్‌మెంట్‌ గ్రూప్‌ స్టార్టప్‌లకు సహకారం అందించి అన్ని దేశాల మధ్య సమన్వయం సాధించడానికి కృషి చేస్తుంది. విభిన్న భాగస్వామ్యం ద్వారా అందరి భవిష్యత్తులో స్టార్టప్‌ను ఒక భాగంగా చేయడానికి ప్రపంచ దృక్పథంతో పనిచేయాలని స్టార్టప్‌–20 ఎంగేజ్‌మెంట్‌ గ్రూప్‌ ఆకాంక్షిస్తోంది. (క్లిక్‌ చేయండి: గుజరాత్‌, హిమాచల్‌ ఫలితాలు; వాస్తవాలు గ్రహించాల్సింది ఎవరు?)


- డాక్టర్‌ చింతన్‌ వైష్ణవ్‌ 
మిషన్‌ డైరెక్టర్, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌; స్టార్టప్‌–20 అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement