జెరూసలెం: దక్షిణ గాజా నగరమైన రఫాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. నివాస ప్రాంతాలు, ప్రభుత్వ భవనాలను టార్గెట్ చేస్తూ బాంబుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 109 మంది మృతిచెందినట్టు సమాచారం.
కాగా, రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల మధ్య భీకరపోరు ప్రారంభమైంది. తూర్పు రఫా, పశ్చిమ రఫాను విడదీసే రహదారిపై ఇజ్రాయెల్ తన యుద్ధ ట్యాంకులను మోహరించింది. దీంతో, హమాస్ కూడా ఐడీఎఫ్ దళాలపై భారీస్థాయిలో రాకెట్లను ప్రయోగిస్తోంది. దీంతో రఫాలో తలదాచుకుంటున్న 14 లక్షలకు పైగా పాలస్తీనియన్ పౌరులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటికే లక్షా పదివేల మంది రఫాను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు.
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం గాజాలో ఏ ప్రాంతం కూడా సురక్షితం కాదని పేర్కొంది. అలాగే, ఆహారం, ఇంధనం, మందులను తీసుకుని వస్తున్న 400 ట్రక్కులు సరిహద్దుకు ఆవల ఈజిప్టువైపు నిలిచిపోయాయి. గాజాలో ప్రజల ఆకలి తీర్చేందుకు రోజుకు కనీసం 500 ట్రక్కుల ఆహారం, మందులు అవసరమవుతాయని తెలిపింది. ఇజ్రాయిల్ చర్య మూలంగా రఫాలోని 15 లక్షల మంది ఆకలి రక్కసి కోరల్లో చిక్కుకునే ప్రమాదం ముంచుకొస్తోంది.
ఇక, ప్రస్తుతానికి రఫాలో మూడు రోజులకు సరిపడా ఇంధనం, ఆహార నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అది పెను మానవ విపత్తుకు దారి తీస్తుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. మందుల సరఫరా ఆగిపోవడం వల్ల ఆసుపత్రులు మూత పడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment