పల్లె పాలనపై శిక్షణకు హాజరైన ప్రత్యేకాధికారులు (ఫైల్)
ఖమ్మం: ఓ మండల పంచాయతీ అధికారి(ఎంపీఓ) ఇప్పటికే మండలంలోని 18 గ్రామపంచాయతీలను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈనెల 2 నుంచి ప్రత్యేక పాలనను తీసుకొచ్చింది. దీంతో సదరు అధికారికి మూడు పంచాయతీల బాధ్యతలు కేటాయించారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా పర్యవేక్షిస్తున్న ఆయన మళ్లీ మూడు పంచాయతీల బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. ఇలా ప్రత్యేక అధికారులుగా నియమితులైన ప్రతీ అధికారికి రెండు చోట్ల బాధ్యతలు నిర్వర్తించడం సవాల్‌గానే మారిందని చెబుతున్నారు.
రెండు నుంచి మూడు జీపీలు..
గ్రామపంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ఇటీవల ముగియగా.. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఉమ్మడి జిల్లాలోని 1,070 గ్రామపంచాయతీలకు గాను మొత్తంగా 396 మంది గెజిటెడ్ అధికారులకు స్పెషలాఫీసర్లుగా బాధ్యతలు కేటాయించారు. భద్రాద్రి జిల్లాలో 481 గ్రామపంచాయతీలకు 218 మంది, ఖమ్మం జిల్లాలో 589 గ్రామాలకు 178 మంది అధికారులను నియమించారు.
వీరిలో ఒక్కొక్కరికి రెండు నుంచి నాలుగు పంచాయతీల చొప్పున బాధ్యతలను అప్పగించారు. అయితే, ఈ అధికారులందరూ వివిధ ప్రభుత్వ శాఖల్లో కీలకమైన అధికారులే. దీంతో అటు మాతృశాఖ, ఇటు పంచాయతీల విధులు నిర్వర్తిస్తూ సమన్యాయం చేయాల్సి ఉంటుంది. కానీ శాఖాపరమైన పనులతో ఒత్తిడి ఎదుర్కొంటున్న వీరికి పంచాయతీల అదనపు బాధ్యతలు అప్పగించడంపై ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
పల్లె పాలనతో సంబంధం లేని శాఖలు!
ప్రభుత్వం గతంలో మాదిరి పంచాయతీరాజ్‌శాఖ నుంచే కాకుండా ఇతర శాఖల అధికారులను సైతం గ్రామపంచాయతీల ప్రత్యేక అధికారులుగా నియమించింది. గ్రామపాలనకు సంబంధం లేని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, ఆర్‌అండ్‌బీ, జలవనరుల శాఖ, మున్సిపల్, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, ఉద్యానవన, పశుసంవర్థక, విద్యాశాఖ తదితర శాఖల అధికారులు ఇందులో ఉన్నారు.
అనుభవం లేని అధికారులు ఈ బాధ్యతలను నిర్వహించాలంటే కొంత సవాలేనని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2018లో పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేశాక పంచాయతీల బాధ్యతలు మరింతగా పెరిగాయి. దీని ప్రకారం ప్రజలకు మెరుగైన పాలన అందాలంటే క్రమం తప్పకుండా గ్రామపంచాయతీని సందర్శించి రోజువారీ పనులను పర్యవేక్షించాలి. అలాంటప్పుడు మాతృశాఖలో విధులు నిర్వర్తించడం ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈనేపథ్యాన మంగళవారం భద్రాద్రి, ఖమ్మం కలెక్టరేట్లలో పల్లె పాలన, బాధ్యతలపై స్పెషలాఫీసర్లకు శిక్షణ నిర్వహించి కొంత మేర అవగాహన కల్పించారు.
అనేక బాధ్యతలు..
జీపీల ప్రత్యేకాధికారులు రెండు నెలలకోసారి గ్రామసభలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రధానంగా పల్లెల్లో పచ్చదనాన్ని పెంచడానికి నర్సరీల ఏర్పాటు, మొక్కలు నాటించి సంరక్షించటం, ఉపాధి పనులు, రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాను పర్యవేక్షించాలి. అలాగే, గ్రామాల్లో సీజనల్ వ్యాధుల కట్టడి, సిబ్బందికి జీతభత్యాలు, పన్నుల వసూళ్లు, విష జ్వరాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వంటివి కీలకంగా ఉంటాయి. పలు ఇతర శాఖల్లో పనిచేస్తూ ప్రత్యేక అధికారులుగా నియమితులైన వారు ప్రజా సమస్యల పరిష్కారంలో ఏ మేరకు విజయవంతం అవుతారో తేలాలంటే కొన్నిరోజులు వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment