మంచిర్యాలఅగ్రికల్చర్: యాసంగి ధాన్యం అమ్ముకోవడమే కాదు.. ఆ నగదు జమ కావాలన్నా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ధాన్యం విక్రయించి నెల రోజులు గడిచినా నగదు అందక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అప్పు చెల్లించడానికి, సాగు పెట్టుబడికి నగదు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామ రైతులు శుక్రవారం రాస్తారోకో చేశారు. జిల్లాలో 262 కొనుగోలు కేంద్రాల్లో 1.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ నెల 16వరకు జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ముగిసాయి.
తరుగు, మిల్లర్ల తిరకాసు, గన్ని సంచులు, లారీల కొరత, అకాల వర్షాలతో అరిగోస పడ్డారు. క్వింటాల్‌కు ఐదు నుంచి పది కిలోల వరకు కోతలు పెట్టారు. ధర్నాలు, ఆందోళనలతో రోడ్డెక్కి ధాన్యం విక్రయించినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే నగదు జమ చేస్తామని అధికారులు, పాలకులు ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. నగదు కోసం మరోసారి ఆందోళనలు చేపట్టాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
నగదు రూ.147.33 కోట్లు పెండింగ్
ఈ సీజన్‌లో 25,088 మంది రైతుల నుంచి 1,80,483.040 టన్నుల ధాన్యం సేకరించారు. ఇందుకు గాను రూ.353,74,67,584 రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. ఇప్పటివరకు 16,578 మందికి గాను రూ.206,41,63,488 ఖాతాల్లో జమైంది. ఇంకా 8,510 మందికి రూ.రూ.147,33,04,096 అందా ల్సి ఉంది. బుక్ కీపర్లు రైతుల నుంచి కొనుగోలు చే సిన ధాన్యం వివరాలను ట్యాబ్‌లో అప్‌లోడ్ చేసిన 48 గంటల్లోగా రైతు ఖాతాలో నగదు జమ కావాల్సి ఉంటుంది. కానీ నెల గడుస్తున్నా డబ్బులు అందక రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
ఇప్పటికే వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సాగు పనులు చేపట్టారు. నగదు అందని రైతులు ఇంకెప్పుడు చెల్లింపులు చేస్తారోనని ఆందోళనలో ఉన్నారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుంచే డబ్బులు రాలేదని, జమ అయిన వరకు రైతులకు బది లీ చేశామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.
నెలరోజులు దాటింది..
ధాన్యం విక్రయించి నెల రోజులు దాటింది. అయినా డబ్బులు ఖాతాలో జమ కాలేదు. 239 బస్తాలు తూకం వేసినా డబ్బుల చెల్లింపు లేకపోవడం దారుణం. రెండు రోజులలో పడుతయని చెప్పి నెల రోజులుగా తిప్పతున్నారు. సెంటర్ నిర్వాహకులను అడిగితే మిల్లు ట్యాగింగ్ కాలేదని చెబుతున్నారు. వానాకాలం సాగు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు చేతిలో పైసలు లేక తిప్పలు పడుడు అయితంది.
– రైతు శివలాల్, గ్రామం: లింగపూర్, మం:దండేపల్లి
ధాన్యం డబ్బుల కోసం రైతుల రాస్తారోకో
దండేపల్లి: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం విక్రయించిన 40రోజులు దాటినా నగదు చె ల్లించకపోవడంతో ఆగ్రహించిన రైతులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. మండలంలోని లింగా పూర్ గ్రామనికి చెందిన పలువురు రైతులు స్థాని కంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధా న్యం విక్రయించారు. ఖాతాలో నగదు జమ కాకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మా ట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మితే 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తున్నట్లు బీఆర్‌ఎస్ నాయకులు గొప్పలు చెబుతున్నారని, 40 రోజు లు గడుస్తున్నా ఖాతాలో జమ కావడం లేదని ఆరోపించారు. సహకార సంఘం కార్యాలయాని కి వెళ్లి అడిగితే మిల్లు ట్యాగింగ్ కాలేదని చెబుతున్నారని అన్నారు. వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సై ప్రసాద్ రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment