గుంటూరు కారంపై నెగెటివ్‌ టాక్‌.. మహేశ్‌బాబు ఏమన్నాడంటే? | Sakshi
Sakshi News home page

Guntur Kaaram: కావాలనే టార్గెట్‌ చేశారు.. వసూళ్లతోనే సమాధానం చెప్పాం

Published Fri, Jan 19 2024 6:06 PM

Naga Vamsi Comments on Mahesh Babu Guntur Kaaram Negative Talk - Sakshi

'అతడు', 'ఖలేజా' వంటి సూపర్‌ హిట్‌ సినిమాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి వారంలోనే ఈ సినిమా రూ.212 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది.

భారీ వసూళ్లు..
ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు నిర్మాత ఎస్. నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. "గుంటూరు కారం సినిమా విడుదలై నిన్నటితో వారం రోజులు అయింది. కొందరి అంచనాలను తప్పని నిరూపిస్తూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. బయ్యర్లు అందరూ బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యారు. కొందరు కావాలనే ఈ సినిమాను టార్గెట్‌ చేసి తప్పుడు రివ్యూలిచ్చారు. కానీ కుటుంబ ప్రేక్షకులు, సాధారణ ప్రేక్షకులు ఎప్పుడైతే సినిమాకి రావడం మొదలుపెట్టారో సాయంత్రానికి ఒక్కసారిగా టాక్ మారిపోయింది. ఇది నేను చెప్పడం కాదు.. ఇప్పటిదాకా సాధించిన వసూళ్లే చెబుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తల్లీకొడుకుల సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది.

మహేశ్‌కు మొదటి నుంచీ నమ్మకముంది
గతంలో మా బ్యానర్ నుంచి పండగకి ఒక సినిమా వచ్చేది. సినిమా బాలేదని రివ్యూలు వచ్చాయి. వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. కానీ ఇప్పుడు గుంటూరు కారం చిత్రం రివ్యూలతో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబడుతోంది. పండగ కారణమైతే అన్ని సినిమాలు హిట్ కావాలి కదా. పండగకు వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మహేశ్‌బాబు మొదటి నుంచి ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. మొదట్లో నెగటివ్ రివ్యూలు వచ్చినా ఆయన ఏమాత్రం ఆందోళన చెందలేదు.

ఆయన అంచనా నిజమైంది
రేపటి నుంచి ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడండి అంటూ మాకు భరోసా ఇచ్చారు. ఆయన అంచనానే నిజమైంది. ఆయన ధైర్యమే ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడానికి కారణమైందనిపించింది. ఇది మాస్ సినిమా అని అంతా భావించారు. త్రివిక్రమ్ గారి శైలిలో ఉండే ఫ్యామిలీ సినిమా అని ముందుగా ప్రేక్షకులకు తెలిసేలా చేయలేకపోయాము. అయినా జానర్ ను బట్టి ఒక్కో సినిమా ఒక్కో ప్రాంతంలో ఎక్కువ వసూళ్లు రాబడుతుంది. సినిమా విజయం అనేది మొత్తం వసూళ్లపై ఆధారపడి ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: చిరంజీవి ఇంటికి పిలిచి ఆఫరిస్తే రిజెక్ట్‌ చేశా.. అయినా తన నుంచి మెసేజ్‌..

Advertisement
 
Advertisement
 
Advertisement