సాక్షి, విజయవాడ: కేంద్ర కేబినెట్‌లో ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలకు చోటు దక్కింది. ఒక సీనియర్, ఇద్దరు జూనియర్ ఎంపీలకు ఛాన్స్ లభించింది. ఒక బీసీ, ఇద్దరు ఓసీలకు కేబినెట్‌లో స్థానం లభించింది. కేంద్ర కేబినెట్‌లో కింజరాపు రామ్మోహన్‌నాయుడికి స్థానం దక్కగా.. మూడు సార్లు ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. బీసీ సామాజిక వర్గం నుంచి కేంద్ర కేబినెట్ పదవిని రామ్మోహన్ దక్కించుకున్నారు.
టీడీపీలో రెండో మంత్రి పదవిని పెమ్మసాని చంద్రశేఖర్ దక్కించుకున్నారు. దేశంలోని అత్యంత ధనవంతుడైన ఎంపీ అభ్యర్థిగా పేరొందిన పెమ్మసాని చంద్రశేఖర్.. తొలిసారి ఎంపీగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే టీడీపీలో చేరి, ఎంపీ సీటును పెమ్మసాని దక్కించుకున్నారు. బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మను మంత్రి పదవి వరించింది. తొలిసారి ఎంపీగా శ్రీనివాస వర్మ ఎన్నికయ్యారు. పురందేశ్వరి, సీఎం రమేష్‌లకు తొలి కేబినెట్‌లో అవకాశం దక్కలేదు. క్షత్రియ, కమ్మ, కొప్పుల వెలమ సామాజికవర్గాలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.
శ్రీనివాస్ వర్మ ప్రొఫైల్..
క్షత్రియ వర్గానికి చెందిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ 1967 ఆగస్టు నాలుగున భూపతి రాజు సూర్యనారాయణరాజు దంపతులకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. ఈయన విద్యాపరంగా డబుల్ ఎంఏ చేయడంతో పాటుగా ఎం ఎల్ లిటరేచర్, బిఎల్ కూడా చేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రావీణ్యులు. 1991లో బీజేపీ పార్టీలో చేరిన శ్రీనివాస్ వర్మ 95 వరకు బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్‌గా, 95 నుండి 97 వరకు భీమవరం టౌన్ పార్టీ ప్రెసిడెంట్‌గా, 97 నుంచి 99 వరకు పార్టీ జిల్లా కార్యదర్శిగా.. 99 నుంచి 2001 వరకు నర్సాపురం పార్లమెంటు కన్వీనర్‌గా, 2001 నుండి 2003 వరకు బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్‌గా, 2003 నుంచి 2009 వరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఎంపీగా పోటీ చేసి పరాజయం చెందారు.
2010 నుంచి 2018 వరకు పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా, 2018 నుండి 2020 వరకు పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జిగా, 2020 నుండి 2023 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. భీమవరం మున్సిపాలిటీకి కౌన్సిలర్‌గా, ఫ్లోర్ లీడర్‌గా, ప్యానల్ చైర్మన్‌గా, డీఎన్ఆర్ విద్యాసంస్థలకు జాయింట్ సెక్రటరీగా, భూపతి రాజు బాపిరాజు ఎడ్యుకేషనల్ సొసైటీకి చైర్మన్‌గా, భీమవరం బిల్డర్స్ అసోసియేషన్‌కు గౌరవ ప్రెసిడెంట్‌గా కూడా శ్రీనివాస్ వర్మ సేవలందించారు.
Comments
Please login to add a commentAdd a comment