యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్ జస్వంత్ ఈ మధ్య గంజాయి కేసులో దొరికిపోయిన తర్వాత రోజూ పలు కథనాలు వస్తూనే ఉన్నాయి. వాస్తవంగా షణ్ముక్ అన్నయ్య సంపత్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసి పోలీసులతో పాటుగా వారి ఫ్లాట్‌కు వెళ్లింది. ఆ సమయంలో షన్ను గంజాయి సేవిస్తూ ఉన్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సందర్భంలో తీసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అక్కడ తన సోదరుడి ప్రియురాలిపై షన్ను ఫైర్ అయ్యాడు. నేనే డిప్రెషన్‌లో ఉన్నానంటూనే.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వ్యాఖ్యలు చేశాడు. దీనిని బట్టి చూస్తే అతను ఏదో మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్రెషన్‌లోనే షణ్ముక్ గంజాయి సేవిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మాదక ద్రవ్యాలకు ఎలా అడిక్ట్ అవుతున్నారు..?
మాదక ద్రవ్యాల సరఫరా మన చుట్టూ ఒక చెయిన్‌లా సాగుతుంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉండే కిళ్లీ దుకాణాలు, కాఫీ షాపుల ద్వారా కూడా వీటి సరఫరా సాగుతూనే ఉంటుంది. సెలబ్రిటీలను హైక్లాస్ పార్టీలకు పిలిచి ఉచితంగా మద్యం సరఫరా చేస్తామని చెబుతూ మొదలైన ఈ వ్యవహారం క్రమంగా వారిని డార్క్ వెబ్‌కు కనెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత డెలివెరీ బాయ్స్ ద్వారా నేరుగా వారి ఇంటికే సరఫరా చేసే వరకూ కథ చేరుతుంది. ఇదే విషయాన్ని గతంలో పోలీసు శాఖ వారు వివిధ సందర్భాల్లో చెప్పారు.
ఎలాంటి వారు బానిసలుగా మారుతున్నారు..?
ఆర్థిక సమస్యలు, ప్రేమ విఫలం, ఒత్తిడి, మోసాలు, విరక్తి.. ఇలా కారణం ఏదైనా కావొచ్చు.. తాత్కాలిక సమస్యల్ని ఎదుర్కోలేక చాలా మంది క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే త్యజిస్తున్నారు. స్టార్ హోదా.. డబ్బు.. అభిమానులు.. గొప్ప పేరు ఉన్న సినీ నటులు కూడా ఆత్మహత్య చేసుకుని వార్తల్లో నిలుస్తున్నారు. నాటి సిల్క్‌స్మిత నుంచి బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వరకూ ఇలా ఆత్మహత్యలకు పాల్పడిన తారలెందరో ఉన్నారు.
తాజాగా పోలీసుల ముందు షణ్ముక్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. గంజాయి లాంటివి తీసుకునేటప్పుడు స్కిజోపెర్నియాలాంటి తీవ్రమైన మానసిక సమస్యలు కనిపించడంతో పాటు వారి మూడ్‌లో మార్పులు, మానసిక ఒత్తిడి, ఆందోళన కలుగుతాయి. మత్తు పదార్థాలను ఇంజెక్షన్లు ద్వారా తీసుకోవడం వల్ల హెచ్ ఐ వి లాంటి వి వచ్చే ముప్పు కూడా ఉందని వైద్యులు చెబుతున్న మాట.
డిప్రెషన్‌లో ఉన్నానని షణ్ముఖ్ ఎందుకు అన్నారు
షణ్ముక్ ఇంటికి వెళ్లిన సమయంలో అతను ఇలాంటి మాటే అన్నాడు.. తను పూర్తిగా డిప్రెషన్‌లో ఉన్నట్లు చెప్పాడు. కొంత సమయం పాటు తన అన్నయ్య ప్రియురాలిపై ఫైర్ అయ్యాడు. వాస్తంగా షణ్ముక్ తన కెరియర్‌ను చాలా కష్టపడి బిల్డ్ చేసుకున్నాడు. ఒక సాధారణ యూట్యూబర్‌గా ప్రారంభమైన తన జీవితం.. బిగ్ బాస్ వరకు తీసుకోచ్చింది. ఆయన తీసిన షార్ట్ ఫిలింస్‌కు బాగా చదువుకున్న యువకులే ఎక్కువగా అడిక్ట్ అయ్యారు.. వాటిలో కంటెంట్ కూడా మధ్యతరగతి వర్గాలకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
అంతలా యూత్‌ను ఆకర్షించిన షన్ను ఇప్పుడు డిప్రెషన్‌కు చేరుకునే స్థాయికి ఎందకు చేరుకున్నాడో తెలియదు. కానీ షన్ను వ్యక్తిగత జీవితంలో ప్రేమించిన అమ్మాయి దూరం కావడం వల్లే ఎక్కువగా డిప్రెషన్‌లోకి వెళ్లాడని కొందరు చెబుతున్న మాట. మరికొందరేమో బిగ్ బాస్ నుంచి వచ్చాక భారీగా ఆఫర్లు వస్తాయని అనుకుంటే కెరియర్ పరంగా మునపటి కంటే మరింత డౌన్ కావడమని చెబుతున్నారు. ఈ రెండు కారణాలతోనే షన్ను తీవ్ర నిరాశకు గురి కావడం జరిగిందని చెబుతున్నారు.
డ్రగ్స్‌కు బానిసై పడి లేచిన కెరటాన్ని గుర్తు చేసుకోండి
అమెరికా వెటరన్ స్విమ్మర్ ఆంటోనీ ఇర్విన్ ఎంతో మందికి స్పూర్తి.. 2004లో సిడ్నీ ఒలింపిక్స్‌లో 19 ఏళ్లకే బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంకేముంది విపరీతమైన క్రేజ్ తన సొంతమైంది. లగ్జరీ జీవితానికి అలవాటు పడ్డాడు. మత్తు పదార్థాలకు బానిసగా మారి ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచేవాడు. ఇష్టరీతిన బైక్ రైడింగ్ చేస్తూ పట్టుబడటం, అధికారులు హెచ్చరించి వదిలిపెడితే.. మళ్లీ తనకు నచ్చినట్లుగా జీవితాన్ని లీడ్ చేశాడు. చివరకు వింత వ్యాధి(టోరెట్ సిండ్రోమ్)తో నిత్యం అవస్థపడేవాడు.
దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇర్విన్.. ఆత్మహత్యాయత్నం చేసినా ప్రాణాలతో బయటపడ్డాడు. భగవంతుడు తనకు పునర్జన్మ ప్రసాదించాడని మళ్లీ స్విమ్మర్‌గా అవతారమెత్తాడు. 2016 రియో ఓలింపిక్స్‌లో పాల్గొని రెండు స్వర్ణాలు కైవసం చేసుకుని లేటు వయసులో స్వర్ణం కొల్లగొట్టిన అమెరికన్ స్విమ్మర్‌గా రికార్డులకెక్కాడు. డ్రగ్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి ప్రస్తుతం కూడా రేసులో ఉన్నాడు.
మాదక ద్రవ్యాలు తీసుకునే వారిని నేరస్థుల్లా చూడటం మానేసి, వారిని డీఅడిక్ట్ చేసేందుకు సహకారం అందించాల్సిన అవసరముంది. దీనికి తల్లి తండ్రులు, డాక్టర్లు, సమాజం, మీడియా కూడా సహకారం అందించాలని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేని వారే ఎక్కువగా ఇలాంటి వాటికి అడిక్ట్ అవుతారని పలువురు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment