న్యూఢిల్లీ: బిహార్ రాజధాని పాట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడ్ని రాజస్థాన్ ఉదయ్‌పూర్‌కు తీసుకెళ్లింది ఇండిగో విమానం. సిబ్బంది నిర్లక్ష‍్యంతో అతని వద్ద సరైన టికెట్, బోర్డింగ్ పాస్ ఉన్నప్పటికీ.. పాట్నా విమానానికి బదులు ఉదయ్‌పూర్ విమానంలో ఎక్కించారు. తీరా ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక పాట్నాలో ఉండాల్సిన తాను ఉదయ్‌పూర్‌లో ఉండటం చూసి ప్రయాణికుడు షాక్ అయ్యాడు.
జనవరి 30న జరిగిన ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టనుంది. ఈ ప్రయాణికుడి పేరు అఫ్తార్ హుస్సేన్. జనవరి 30న పాట్నా వెళ్లేందుకు ఇండిగో విమానం 6E-214లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే పొరపాటున అతడ్ని 6E-319 ఇండిగో విమానంలో ఎక్కించారు సిబ్బంది. తీరా ఉదయ్‌పూర్‌లో దిగాక అతనికి అసలు విషయం తెలిసింది.
ఈ విషయాన్ని ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు హుస్సేన్. వెంటనే ఆయన ఇండిగో సంస్థను అప్రమత్తం చేశారు. దీంతో సదరు సంస్థ హుస్సేన్‌ను మళ్లీ ఢిల్లీకి తీసుకెళ్లింది. ఆ మరునాడు అంటే జనవరి 31న అక్కడినుంచి పాట్నాకు తీసుకెళ్లింది.
ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎక్కడ జరిగిందని డీజీసీఏ దర్యాప్తు జరపనుంది. ప్రయాణికుడి బోర్డింగ్ పాసు స్కాన్ చేయకుండా విమానం ఎలా ఎక్కించారు? బోర్డింగ్‌కు ముందే రెండుసార్లు బోర్డింగ్ పాసులను స్కాన్ చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అతను వేరే విమానంలో ఎలా ఎక్కాడు? అని విచారణ జరపనున్నారు. అనంతరం విమాన సంస్థపై చర్యలు తీసుకోనున్నారు.
చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగికి షాక్! అటు ఉద్యోగం, ఇటు పెళ్లి చేసుకునే పిల్లా? ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు!
Comments
Please login to add a commentAdd a comment