చెన్నై: ఈ నెల 18వ తేదీన తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో నాలుగు కిలోమీటర్ల మేర సాగాల్సిన ప్రధాని మోదీ రోడ్ షోకు మద్రాస్ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. మతపరంగా సున్నితమైన ప్రాంతం అనే కారణంతో కోయంబత్తూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రోడ్ షోకు అనుమతి నిరాకరించడం సహేతుకంగా లేదని హైకోర్టు పేర్కొంది. ప్రధానమంత్రికి నిరంతరం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత ఉంటుందని గుర్తు చేసింది. ‘ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి ఉన్నత హోదా కలిగిన నాయకులను ప్రజలు ఎన్నుకున్నారు.
కాబట్టి, తమను ఎన్నుకున్న వారిని కలవకుండా నేతలను ఆపడం సరికాదు’అని అభిప్రాయపడింది. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత రోడ్ షో జరగనున్నందున పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు. రోడ్ షోకు అనుమతి నిరాకరిస్తూ పోలీస్ కమిషనర్ పురమ్ రంగే తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రమేశ్ కుమార్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేశ్ శుక్రవారం విచారణ జరిపారు. రోడ్ షోకు షరతులతో కూడిన అనుమతివ్వాలని కమిషనర్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment