మోర్తాడ్ నుంచి రైస్‌మిల్లుకు తరలుతున్న ధాన్యం
మోర్తాడ్: ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన రైతు మాదాం నర్సయ్య నెల రోజుల కింద శెట్‌పల్లి సహకార సంఘం ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రంలో 118 క్వింటాళ్ల ధాన్యం విక్రయించాడు. అతనికి రూ.2,43,080 సొమ్ము రావాల్సి ఉంది. ఇప్పటి వరకు సదరు రైతు నర్సయ్య మొబైల్‌కు ఓటీపీ మెస్సెజ్ రాకపోవడంతో ధాన్యం సొమ్ము ఇప్పట్లో జమ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వర్షాకాలం పంటలకు పెట్టుబడి ఎలా పెట్టాలనే సందిగ్ధంలో ఉన్న రైతు నర్సయ్యకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇది ఒక్క రైతు నర్సయ్యకు ఎదురైన సమస్యనే కాదు. ఎంతో మంది వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు కలుగుతున్న కష్టాలు. ఓటీపీ మొబైల్ ఫోన్‌కు వచ్చిన నాలుగైదు రోజుల్లోనే ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతుంది.
జిల్లాలో యాసంగి సీజనుకు సంబంధించిన ధాన్యం సేకరణ పూర్తి చేసినా రైతులను ఓటీపీ కష్టాలు వెంటాడుతుండటంతో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 459 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.45 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యంను సేకరించారు. దాదాపు 200 లారీల ధాన్యానికి సంబంధించి రైతులకు ఓటీపీ జనరేట్ కావడం లేదు. యాసంగి పంటలకు సంబంధించి క్రాప్‌బుకింగ్ సరిగా పూర్తి చేయకపోవడం, కొనుగోలు కేంద్రాల నుంచి తరలించే ధాన్యం ఏ మిల్లుకు తరలించాలో అలాట్‌మెంట్ జరగకపోవడంతో ఓటీపీ రావడం లేదని తెలుస్తుంది. రోజుల తరబడి ధాన్యం డబ్బులు కోసం రైతులు నిరీక్షించడానికి ఓటీపీ ప్రధాన సమస్య అని వెల్లడైతుంది. యాసంగిలో సాగు చేసిన పంటలను ఏఈవోలు క్రాప్‌బుకింగ్ పూర్తి చేశారు.
కొన్ని చోట్ల రైతు సాగు చేసిన విస్తీర్ణానికి నమోదైన ఎకరాలకు తేడా ఉండటంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం లెక్క, రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి వీలు పడటం లేదు. కమ్మర్‌పల్లి సహకార సంఘం పరిధిలో క్రాప్ బుకింగ్‌లో అనేక తప్పులు దొర్లడంతో రైతులకు ఓటీపీ జనరేట్ చేయడం ఇబ్బందిగా మారింది. చివరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవసాయాధికారులతో సంప్రదింపులు జరిపి క్రాప్ బుకింగ్‌ను సరి చేయాల్సి వస్తుంది. పంటలను సాగు చేసిన సమయంలోనే క్రాప్ బుకింగ్ పక్కాగా చేసి ఉంటే సమస్య వచ్చేది కాదని రైతులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment