బీఆర్‌ఎస్‌లో రగులుతున్న అసమ్మతి.. మంత్రి వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే  | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌లో రగులుతున్న అసమ్మతి.. మంత్రి వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే 

Published Sat, Apr 22 2023 9:33 AM

BRS Party: Malla Reddy VS Ex MLA Sudhir Reddy In medchal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి మల్లారెడ్డి వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిగా మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ తయారైంది. మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిల మధ్య పార్టీలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు ప్రధాన నాయకులు చెరో గ్రూపుగా మారడంతో మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌లో అసమ్మతి బయటపడుతోంది. ఆత్మీయ సమ్మేళనాలతో మరోసారి ఈ విషయం బయటపడింది. 

మొదటి నుంచీ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరే.. 
2014లో మేడ్చల్‌ నుంచి కారు గుర్తుపై సుధీర్‌రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై ఐదేళ్లు పని చేశారు. 2014 ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్‌కు టీడీపీ తరఫున మంత్రి మల్లారెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత బంగారు తెలంగాణ సాధన కోసం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపీగా ఉన్న సమయంలోనే మల్లారెడ్డి మేడ్చల్‌ నియోజకవర్గంలో తన అనుచరుల ద్వారా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు. అదే సమయంలో నాటి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి మల్లారెడ్డి మధ్య పలు మార్లు భేదాభిప్రాయాలు వచ్చినా అవి అప్పటి వరకే పరిమితమయ్యాయి.

2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధిష్టానం సుధీర్‌రెడ్డిని కాదని ఎంపీగా ఉన్న మల్లారెడ్డికి టికెట్‌ ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ సమయంలో అలకబూనిన సుధీర్‌రెడ్డిని ప్రస్తుత రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధిష్టానం దూతగా వచ్చి బుజ్జగించి ఆయనకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చి బుజ్జగించారు. ఆ తర్వాత మంత్రిగా మల్లారెడ్డి కావడం, ఆయన అర్థ బలం ముందు సుధీర్‌రెడ్డి తట్టుకోలేకపోవడంతో ఆయన కొంతమేర వెనకడుగు వేశారు.

ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సు«దీర్‌రెడ్డి తన తనయుడు శరత్‌చంద్రారెడ్డిని ఘట్‌కేసర్‌ నుంచి పోటీలో దింపి గెలిపించుకున్నారు. అదే ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డి తన బావమరిది మద్దుల శ్రీనివాస్‌రెడ్డిని మూడుచింతలపల్లి మండలం నుంచి పోటీలో దింపగా ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో సు«దీర్‌రెడ్డి తనయుడు శరత్‌చంద్రారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నాటి నుంచి నియోజకర్గంలో ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. సుధీర్‌రెడ్డి తన అనుచరులతో తనకూ ఓ గ్రూపును ఏర్పాటు చేసుకోగా మంత్రి మల్లారెడ్డి తన కోటరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. 

ఆత్మీయ సమ్మేళనాలతో మరోసారి రచ్చ.. 
బీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు జోరుగా బయట పడ్డాయి. మొదట్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థాయి, గ్రామ, వార్డుస్థాయి నాయకులు తమ అసమ్మతి వెల్లగక్కినా అది బయటపడకుండా మంత్రి తనయుడు మహేందర్‌రెడ్డి మేనేజ్‌ చేశారు. చాలామంది నాయకులు ఆత్మీయ సమ్మేళనాలకు డుమ్మా కొట్టినా మంత్రి బలం ముందు తమ అసమ్మతిని బహిరంగంగా వెల్లడించలేకపోయారు. 

ఆత్మీయ సమ్మేళనాలకు హాజరైన సుధీర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డిలు తమ ప్రసంగాల్లో అధిష్టానం ఎవరికి టికెట్‌ కేటాయించినా వారి గెలుపు కోసం అందరూ పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సుధీర్‌రెడ్డి ఈ అంశాన్ని పదేపదే నాయకుల ముందు ఉంచడంతో చిర్రెత్తిన మంత్రి మల్లారెడ్డి మేడ్చల్‌ మండల ఆత్మీయ సమ్మేళనంలో టికెట్‌ తనకు సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారని, గెలుపు తనదేనని అన్నారు. 

ఆ తర్వాత జరిగిన బోడుప్పల్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఇదే అంశం ఇద్దరి నేతల మధ్య అగ్గి రాజేసింది. పార్టీ ఎవరికి టికెట్‌ ఖరారు చేయలేదని సుధీర్‌రెడ్డి అనగా తనకే కేటాయించిందని మంత్రి మల్లారెడ్డి అనడం వారి మధ్య వాగ్వాదానికి తేరలేపింది. మొదటి నుంచీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న నేతలకు మరోసారి అవకాశం రావడంతో పార్టీ పరువును జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో కలిపారు.

రంగంలోకి ఎవరు..? 
వీరి మధ్య ఆధిపత్య పోరు జోరుగా ఉండటంతో అధిష్టానం మేడ్చల్‌ గెలుపుకోసం చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజును, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని రంగంలోకి దించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మల్లారెడ్డి స్థాయిలో కాకున్నా ఇద్దరు నేతలు అర్థబలం గట్టిగా ఉన్నవారు కావడం, సీఎంకు నమ్మి న బంట్లుగా ఉండటంతో వీరిద్దరిలో ఒకరికి మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయించే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  

 
Advertisement
 
Advertisement