రవీంద్ర జడేజా (PC: BCCI)
India vs England 2nd Test: ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు రవీంద్ర జడేజా దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బేనని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్ జడ్డూ అని.. అతడు లేని లోటును ప్రస్తుత జట్టులోని ఏ ఆటగాడూ తీర్చలేడని పేర్కొన్నాడు.
కాగా స్టోక్స్ బృందంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో రోహిత్ సేన 28 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత మ్యాచ్ టీమిండియా చేతిలో ఉందనిపించినప్పటికీ.. అనూహ్య రీతిలో పుంజుకున్న ఇంగ్లండ్ గెలిచి సత్తా చాటింది.
మొదటి టెస్టులో అదరగొట్టాడు
అయితే, ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆటగాళ్లలో స్పిన్ ఆల్‌రౌండర్ జడేజా పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఉప్పల్ టెస్టులో మొత్తంగా ఐదు వికెట్లు తీయడంతో పాటు.. 89 పరుగులు సాధించాడు.
అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో జడ్డూ వైజాగ్‌లో జరుగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడితో పాటు కేఎల్ రాహుల్ కూడా గాయం బారిన పడటంతో వీరి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్‌లకు పిలుపునిచ్చారు బీసీసీఐ సెలక్టర్లు.
టీమిండియాకు కష్టమే
ఈ విషయంపై స్పందించిన మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. ‘‘జడ్డూ ఉంటేనే టీమిండియాకు బలం. బ్యాటర్‌గా.. బౌలర్‌గా.. గన్ ఫీల్డర్‌గా అతడి సేవలను జట్టు కచ్చితంగా మిస్సవుతుంది.
ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో అతడే నంబర్ వన్ టెస్టు ఆల్‌రౌండర్ అనడంలో సందేహం లేదు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యంలో నిలిచిందంటే అందుకు కారణం జడేజానే.
అతడు ఉన్నా.. మరో జడ్డూ కాలేడు కదా
జట్టులో ఉంటే అతడు కనీసం రెండు నుంచి మూడు వికెట్లు తీయడం కూడా గ్యారెంటీ. జడ్డూ స్థానంలో బ్యాటింగ్ కూడా చేయగల బ్యాటర్‌ను తీసుకోవాలని మేనేజ్‌మెంట్ భావించడం సహజం. కాబట్టి వాషింగ్టన్ సుందర్‌కే ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే, అతడు పరుగులు ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేయగలడేమో గానీ వికెట్లు మాత్రం తీయలేడు. బ్యాటింగ్ పరంగా అతడు మెరుగైన ఆటగాడే. అయితే, వాషీ జడ్డూ మాత్రం కాలేడు కదా’’ అని వ్యాఖ్యానించాడు.
ఏదేమైనా వాషింగ్టన్ సుందర్‌ను తుదిజట్టులో ఆడించినా జడ్డూ లేని లోటును మాత్రం పూడ్చలేడని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా - ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌లో రెండో టెస్టు ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment