విశాఖ స్పోర్ట్స్: ఒకవైపు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తదితర కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం... మరోవైపు అనుభవంలేని యువ ఆటగాళ్లు... తొలి టెస్టులో ఊహించని పరాజయం... ఈ నేపథ్యంలో వైజాగ్‌లోని వైఎస్‌ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్టులో భారత ప్రదర్శన ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొని ఉంది.
ఈ వేదికపై భారత జట్టు ఇప్పటి వరకు రెండు టెస్టులు ఆడింది. ఆ రెండింటిలోనూ భారత జట్టే గెలిచింది. కోహ్లి కెప్టెన్సీలో 2016 నవంబర్ 17 నుంచి 21 వరకు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో టీమిండియా 246 పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం 2019 అక్టోబర్ 2 నుంచి 6 వరకు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో కోహ్లి సారథ్యంలోనే భారత జట్టు 203 పరుగుల తేడాతో విజయం సాధించింది.
క్రితంసారి ఇక్కడ ఆడిన భారత టెస్టు జట్టు నుంచి కేవలం రోహిత్ , అశ్విన్ మాత్రమే ఈసారి ఆడుతున్నారు. నాటి టెస్టులో రోహిత్ రెండు సెంచరీలతో (తొలి ఇన్నింగ్స్‌లో 176; రెండో ఇన్నింగ్స్‌లో 127) అదరగొట్టాడు. ఫలితంగా బ్యాటింగ్ విషయంలో ఈసారీ రోహిత్ శర్మపైనే అధిక భారం పడనుంది. మరోసారి రోహిత్ మెరిసి... యశస్వి, అయ్యర్ ఇతర ఆటగాళ్లు కూడా రాణిస్తే విశాఖపట్నంలో భారత జట్టు ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంటుంది.
సంయమనం అవసరం: కోచ్ రాథోడ్
యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని భారత్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నారు. ఒకట్రెండు మ్యాచ్‌లతో వారి సత్తాపై అంచనాకు రావొద్దని ఆయన కోరారు. బుధవారం ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మర సాధన చేశారు. ప్రాక్టీస్ సెషన్ అనంతరం విక్రమ్ రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘ప్రస్తుత భారత జట్టులోని శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. వారి విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు. వారిపట్ల సంయమనంతో వ్యవహరించాలి. అయ్యర్ త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నా.
పిచ్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడటం అలవాటు చేసుకోవాలి. పరుగులు చేసేందుకు అవకాశాలు ఉంటే వాటిని సది్వనియోగం చేసుకోవాలి. షాట్‌ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి’ అని రాథోడ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment