రెండు రైల్వే లైన్లు ! | Sakshi
Sakshi News home page

రెండు రైల్వే లైన్లు !

Published Sun, Jun 4 2023 1:58 AM

- - Sakshi

కోదాడ: ఇప్పటి వరకు ప్యాసింజర్‌ రైలు ముఖం చూడని జిల్లా వాసులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. జిల్లా మీదుగా రెండు రైల్వే లైన్లు వేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కొద్ది సంవత్సరాల్లోనే జిల్లా వాసులకు ఒక సాధారణ, మరో హైస్పీడ్‌ రైల్వేలైన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే డోర్నకల్‌–మిర్యాలగూడ మార్గానికి సంబంధించి సర్వే దాదాపు పూర్తికావొచ్చింది.

తాజాగా శుక్రవారం కేంద్ర రైల్వే, పర్యాటకశాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్‌, కిషన్‌రెడ్డిలు తెలుగు రాష్ట్రాల విభజన హామీల్లో భాగంగా శంషాబాద్‌ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్‌ వరకు హైస్పీడ్‌ రైల్వేలైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని సర్వే కోసం కాంట్రాక్టర్‌ను కూడా నియమించడంతో ఈ ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కే అవకాశముంది. కేంద్ర మంత్రుల తాజా ప్రకటనతో జిల్లావాసులకు ఆనందాన్ని కలిగిస్తుంది.

తీరనున్న జిల్లా వాసుల చిరకాల వాంఛ
తమ పట్టణంలో రైలు ఎక్కాలనుకుంటున్న జిల్లావాసుల చిరకాలకోరిక తీరే సమయం దగ్గరపడింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్‌, కిషన్‌రెడ్డి ప్రకటించిన ఈ కొత్త రైల్వేలైన్‌ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే జిల్లాలోని సూర్యాపేట, కోదాడ వాసులు హైస్పీడ్‌ రైలు ఎక్కడానికి ఎక్కువ సమయం పట్టదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల విభజన హామీల్లో భాగంగా రెండు రాష్ట్రాలను కలుపుతూ శంషాబాద్‌ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్‌ వరకు కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటు చేయనున్నారు.

దీనికోసం ప్రిలిమినరీ ఇంజనీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వేకు రైల్వేబోర్డు అనుమతులు మంజూరు చేసింది. దీనికి కాంట్రక్టర్‌ను కూడా నియమించింది. ఆరు నెలల్లో సదరు కాంట్రాక్టర్‌ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. 220 కి.మీ. గరిష్ట వేగంతో (సెమీ హైస్పీడ్‌) రైళ్లను నడిపే విధంగా ఈ లైన్‌ వేయాలని నిర్ణయించారు. రైల్వే లైన్‌ అలైన్‌మెంట్‌ ప్రాథమికంగా శంషాబాద్‌ నుంచి అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ మీదుగా 65వ నంబర్‌ జాతీయ రహదారికి సమాంతరంగా ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల ఉమ్మడి జిల్లాలోని చౌటుప్పల్‌, చిట్యాల, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ పట్టణాల సమీపంలోనుంచి ఈ లైన్‌ వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

పూర్తికావొచ్చిన డోర్నకల్‌ – మిర్యాలగూడ లైన్‌ సర్వే
డోర్నకల్‌ నుంచి మిర్యాలగూడ వరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న బ్రాడ్‌గేజ్‌ రైల్వేలైన్‌ సర్వే పనులు గడిచిన ఆరు నెలలుగా జరుగుతున్నాయి. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో సర్వే పనులు ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం నల్లగొండ జిల్లా పరిధిలో సర్వే జరుగుతోంది. ఈ లైన్‌ డోర్నకల్‌, నేలకొండపల్లి, కోదాడ, హుజూర్‌నగర్‌ల మీదుగా మిర్యాలగూడకు చేరుకోనుంది.

మరో ప్రతిపాదనలో డోర్నకల్‌, నేలకొండపల్లి, కోదాడ, హుజూర్‌నగర్‌ మీదుగా ఇప్పటికే ఉన్న జాన్‌పహాడ్‌ వద్ద లైన్‌కు కలిసే విధంగా తయారు చేస్తున్నట్లు సమాచారం. దీనిలో మొదటి ప్రతిపాదనకే అధికారులు మొగ్గుచూపుతున్నారని.., వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో ఈ లైన్‌కు నిధులు మంజూరు చేయించడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడకు చెందిన ఐఆర్‌టీఎస్‌ అధికారి బర్మావత్‌ నాగ్యానాయక్‌ తీవ్ర కృషి చేస్తున్నట్లు తెలిసింది.

ఎంపీ కాగానే పార్లమెంట్‌లో ప్రతిపాదించా..
హైదరాబాద్‌ – విజయవాడల మధ్య హైస్పీడ్‌ రైల్వేలైన్‌ ఆవశ్యకతను నేను ఎంపీగా ఎన్నిక కాగానే తొలిసారి పార్లమెంట్‌లో ప్రతిపాదించాను. రెండు రాష్ట్రాల మధ్య ఈ లైన్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాను. ప్రభుత్వం దీనిపై ఇన్నాళ్లకు నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. దీనికి వెంటనే నిధులు మంజూరు చేయించడానికి నావంతు ప్రయత్నం చేస్తాను.
– ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ నల్లగొండ

Advertisement
 
Advertisement
 
Advertisement