సాక్షి, హైదరాబాద్: రేపో మాపో పట్టాలెక్కుతాయనుకున్న ప్యాసింజర్ రైళ్లకు బ్రేక్ పడింది. వేగంగా వ్యాపిస్తుందని భావిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లోనూ వెలుగు చూడటంతో, ప్యాసింజర్ రైళ్లు నడిపే విషయంలో రైల్వే బోర్డు వెనక్కి తగ్గింది. దేశవ్యాప్తంగా 2020 మార్చి చివరలో కోవిడ్ మొదటి లాక్‌డౌన్ సందర్భంగా రైళ్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దశలవారీగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను పట్టాలెక్కిస్తూ వస్తున్న రైల్వేబోర్డు ప్యాసింజర్ రైళ్లను మాత్రం ప్రారంభించలేదు.
ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణికుల నియంత్రణకు అవకాశం లేకపోవటం, ఎక్కువ స్టాపుల్లో ఆగాల్సి ఉండటంతో ఎక్కేవారు, దిగేవారు సైతం ఎక్కువగా ఉంటారనే ఉద్దేశంతో వీటిని నడిపే విషయంలో వెనుకంజ వేస్తూ వచ్చింది. అలా చూస్తుండగానే 20 నెలలు గడిచిపోయాయి. కోవిడ్ రెండో దశ పూర్తిగా తగ్గిపోయినందున ఇక అన్ని రైళ్లను ప్రారంభించాలని అక్టోబర్ చివరలో నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. పది రోజు ల క్రితం పాత పద్ధతిలో రైళ్లను పునరుద్ధరిస్తూ పాత నంబర్లతో, పాత సమయాల్లో నడపటం మొదలుపెట్టింది. రైళ్లు మామాలుగా తిరుగుతున్నా.. ఎక్కడా కోవిడ్ కేసుల పెరుగుదల లాంటి సమస్యలు రాలేదు. దీంతో ఈ వారం లో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లు ప్రారంభిద్దామనుకున్న సమయంలో తొలిసారిగా కర్ణాటక లో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.
కొత్త కేసుల పెరుగుదల లేకుంటే..
కొత్త వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి అనేకమంది ప్రయాణికులు మన దేశానికి వచ్చారని, వారిలో కొందరు కోవిడ్ పాజిటివ్‌గా ఉన్నారని తేలింది. అలాగే మూడో దశ పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో ఎక్కడా ప్యాసింజర్ రైళ్లు ప్రారంభించొద్దని రైల్వేబోర్డు తాజాగా ఆదేశించింది. మరికొన్ని రోజులు వేచిచూసి, కొత్త కేసుల పెరుగుదల లేకుంటే ప్రారంభించాలని నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 250 ప్యాసింజర్ రైళ్లు తిరుగుతాయి.
ప్రస్తుతం వీటిల్లోంచి 50 రైళ్లను మాత్రం ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో నడుపుతున్నారు. ఇక నగరంలో 121 ఎంఎంటీఎస్ రైళ్లు తిరగాల్సి ఉండగా, దశలవారీగా 60 రైళ్లను ప్రారంభించారు. తాజాగా మరో 25 రైళ్లను గురువారం పట్టాలెక్కించారు. ఎంఎంటీఎస్ రైళ్ల విషయంలో నిర్ణయం జోన్ స్థాయిలో తీసుకునే వీలున్నందున స్థానిక అధికారులు వీటికి పచ్చజెండా ఊపారు. కానీ ప్యాసింజర్ రైళ్ల విషయంలో మాత్రం రెడ్ సిగ్నల్ రావటంతో వీటి ప్రారంభాన్ని వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment