సాక్షి, న్యూఢిల్లీ: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, నేరాలను ప్రోత్సహించే పబ్‌లపై దాడులు తప్పవని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ పరిధిలో అలాంటి పబ్‌లపై రాబోయే రోజు ల్లో భౌతిక దాడులు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అలాగే రాత్రి 11:30 తర్వాత తెరిచి ఉంచే వాటిపై కూడా దాడులు తప్పవని పేర్కొన్నారు.
బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విశ్వనగరంగా మారాల్సిన హైదరాబాద్‌ను విషనగరంగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశా రు. కేసీఆర్ సీఎం అయ్యాక హైదరాబాద్‌లో సుమారు 150 పబ్‌లకు అనుమతినిచ్చారని, పబ్‌ల వ్యాపారం వెనుక రాష్ట్రంలోని రాజులు, యువరాజులకు సంబంధించిన వ్యక్తులు కీలకంగా ఉన్నారని ఆరోపించారు. పబ్‌లు, డ్రగ్‌ల సంస్కృతిని ప్రోత్సహించడం వల్లే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు
మిత్రపక్షాలుగా ఉన్న టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు హత్యలు, అత్యాచారాల్లోనూ భాగస్వాములయ్యారని రేవంత్ విమర్శించారు. మైనర్ అత్యాచారం ఘటన గురించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పిన విధానం చూస్తుంటే, కొందరిని తప్పించే ప్రయత్నం చేసినట్టుగా ఉందని ఆరోపించారు. ఈ ఘటనలో నిందితులు ప్రయాణించిన బెంజ్ కారు, ఇన్నోవా వాహనానికి సంబంధించిన కీలకమైన ఆధారాలను, వాటి యజమానుల వివరాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.
యజమానులపై పోక్సో చట్టం ప్రకారం కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్లలోని కీలకమైన ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోందన్నారు. పబ్‌లపై పోలీసుల పర్యవేక్షణ కరువైందని, తనిఖీలు చేయకుండా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని అన్నారు.
ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాలి
మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు సమీక్ష నిర్వహించలేదని, ఇప్పటికైనా తక్షణమే ఉన్నతాధికారులతో తాజా పరిస్థితులపై సమీక్ష జరపాలని రేవంత్‌రెడ్డి కోరారు. మైనర్లను అనుమతిస్తున్న పబ్ యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మైనర్ అత్యాచార వ్యవహారంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌పై సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మైనర్ బాలిక రేప్ విషయంలో ఎందుకు స్పందించట్లేదని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment