రూ.200 కోట్లకు ఈఈఎస్‌ఎల్ ఐపీఓ
♦ వచ్చే నెల్లో మర్చంట్ బ్యాంకర్ల నియామకం
♦ దీనికోసం 20 శాతం వాటాను డైల్యూట్ చేస్తాం
♦ ఈ ఏడాది రూ.6 వేల కోట్లతో విస్తరణ ప్రణాళిక
♦ రూ.4,800 కోట్లు రుణాల రూపంలో సేకరణ
♦ ఈఈఎస్‌ఎల్ ఎండీ సౌరభ్ కుమార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ (ఈఈఎస్‌ఎల్) ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూకు రానుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.200 కోట్లు సమీకరించే యోచన చేస్తున్నట్లు సంస్థ ఎండీ సౌరభ్ కుమార్ బుధవారమిక్కడ విలేకరులతో చెప్పారు. 20 శాతం వాటాను డైల్యూట్ చేయటం ద్వారా ఈ నిధులను సమీకరించనున్నట్లు తెలిపారాయన. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది రూ.6 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారాయన.
‘‘ఈ రూ.6వేల కోట్లలో రూ.1,200 కోట్లు మా వాటాగా పెడతాం. మిగిలిన రూ.4,800 కోట్లనూ రుణాల ద్వారా సమీకరిస్తాం. దీనికోసం వివిధ మార్గాలను అన్వేషిస్తున్నాం. దీన్లో భాగంగా యూకే మార్కెట్లో 10 కోట్ల డాలర్ల విలువైన రూపీ బాండ్లను (మసాలా) కూడా జారీ చేస్తాం’’ అని సౌరభ్ కుమార్ వివరించారు. ప్రస్తుతం తమ సంస్థ చెల్లించిన మూలధనం రూ.460 కోట్లుగా ఉందని, మరో రూ.540 కోట్లను ప్రమోటర్ల ద్వారా సమీకరిస్తామని చెప్పారాయన. ‘‘మిగిలిన రూ.200 కోట్లనూ ఐపీఓ ద్వారా సమీకరిస్తాం. దీనికోసం 20 శాతం వాటాను డైల్యూట్ చేస్తాం. ఐపీఓకు సంబంధించి మర్చంట్ బ్యాంకర్లను నెల రోజుల్లోగా ఎంపిక చేస్తాం’’ అని చెప్పారు.
విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో...
కేంద్ర విద్యుత్ శాఖ సారథ్యంలో ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కలిసి ఈఈఎస్‌ఎల్‌ను జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పాటు చేశాయి. దేశవ్యాప్తంగా ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకునే ప్రాజెక్టుల్ని ఇది అమలు చేస్తుంది. దీన్లో భాగంగా రెండేళ్ల కిందట ‘ఉజాలా’ పథకాన్ని కూడా ఆరంభించింది. ఈ పథకం కింద ఇప్పటికే సాధారణ బల్బుల స్థానంలో విద్యుత్‌ను ఆదా చేసే 24 కోట్ల పైచిలుకు ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటయ్యాయి.
24 లక్షల ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు, 8.5 లక్షల ఫ్యాన్లను విక్రయించారు. ఈ ఏడాది మరో 15 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను జోడిస్తామని సౌరభ్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. 2019 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 77 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయడం సంస్థ లక్ష్యమన్నారు. కంపెనీ ఒక్కో బల్బును రూ.70కే విక్రయిస్తోంది. మూడేళ్లలో పాడైతే కొత్తది ఇస్తారు. అలాగే ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్ రూ.230, విద్యుత్‌ను ఆదాచేసే ఫ్యాన్ రూ.1,150లకు అందుబాటులోకి తెచ్చింది. మీసేవా, రెవెన్యూ కేంద్రాలు, పోస్టాఫీసులు, స్వయం సహాయక సంఘాల ద్వారా, విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద వీటిని విక్రయిస్తున్నారు.
జీహెచ్‌ఎంసీతో భారీ ప్రాజెక్టు..
గ్రేటర్ హైదరాబాద్‌లో 4.5 లక్షల వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను ఆరు నెలల్లో ఏర్పాటు చేయనున్నట్టు సౌరభ్ కుమార్ తెలిపారు. జీహెచ్‌ఎంసీకి వీధి దీపాల విద్యుత్ బిల్లు ఏటా రూ.200 కోట్లు వస్తోంది. ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుతో ఈ బిల్లు సగానికి పడిపోతుంది. ఈ ప్రాజెక్టు కోసం ఈఈఎస్‌ఎల్ రూ.270 కోట్లు వెచ్చిస్తోంది. నిర్వహణ కూడా మాదే. జీహెచ్‌ఎంసీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టడం లేదు. ఆదా అవుతున్న విద్యుత్ బిల్లు నుంచి మాత్రమే లైట్ల ఏర్పాటు, నిర్వహణకుగాను ఏటా సుమారు రూ.70 కోట్లు జీహెచ్‌ఎంసీ ఏడేళ్లపాటు ఈఈఎస్‌ఎల్‌కు చెల్లిస్తుంది’ అని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రాజెక్టులు మరిన్ని చేయబోతున్నాం అని వివరించారు.