వాట్సాప్, స్నాప్‌చాట్ నిషేధం (ప్రతీకాత్మక చిత్రం)
జర్మన్ ఆటోమేటివ్ పార్ట్‌ల సప్లయిర్ కాంటినెంటల్ ఏజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు వాట్సాప్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా యాప్స్ వాడకుండా నిషేధం విధించింది. కంపెనీ జారీచేసే ఫోన్ల ద్వారా వీటిని ఉపయోగించకూడదని, ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. భద్రతా కారణాలతో ఈ నిషేధం విధిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఫోన్లు, టాబ్లెట్లలో సమాచారం నిక్షిప్తమై ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. ఈ నిషేధంతో దాదాపు 36వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడనుందని కాంటినెంటల్ అధికార ప్రతినిధి చెప్పారు. ప్రపంచంలో దిగ్గజ కారు పార్ట్‌ల కంపెనీల్లో ఒకటిగా ఉన్న కాంటినెంటల్‌లో గ్లోబల్‌గా 2 లక్షల 40వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
డేటా రక్షణ విషయానికి వచ్చేసరికి సోషల్ మీడియా సర్వీసుల్లో లోపాలున్నాయని తాము విశ్వసిస్తున్నామని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ యాప్స్ యూజర్ల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని యాక్సస్ చేస్తున్నాయని పేర్కొంది. తమ ఉద్యోగులను, బిజినెస్ పార్టనర్లను రక్షించుకోవాల్సినవసరం ఉందని కాంటినెంటల్ చెప్పింది. మే 25 నుంచి అమల్లోకి వచ్చిన యూరప్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్(జీడీపీఆర్)తో సోషల్ మీడియా కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు ప్రైవసీ అనేది తలనొప్పిగా మారిందని తెలిసింది. ఈ క్రమంలో జీడీపీఆర్‌కు అనుగుణంగా సోషల్ మీడియా కంపెనీలు తమ బాధ్యతల్ని మార్చారని కాంటినెంటల్ చెప్పింది. ఈ సర్వీసులతో డేటా షేర్ చేయాలంటే, ప్రతి ఒక్క యూజర్, తమ కాంటాక్ట్ లిస్ట్‌లోని యూజర్లందరితో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కంపెనీకి ఎలాంటి పరిష్కారం లభించడం లేదు. దీంతో తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ సర్వీసులను పూర్తిగా రద్దు చేయడమే మేలని కాంటినెంటల్ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment