రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై : ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మెజార్టీ విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీరేటు రెపోను వరుసగా రెండోసారి 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతం పెరిగింది. ముడి చమురు ధరలు ప్రస్తుతం కాస్త తగ్గినప్పటికీ, మళ్లీ పెరుగుతాయనే భయాందోళనలుండటం, ఖరీప్ పంటలకు ప్రభుత్వం మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకోవడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాల కారణంతో రెపోను పెంచేందుకే మానిటరీ పాలసీ కమిటీ మొగ్గుచూపింది. మూడు రోజుల సమావేశం అనంతరం ఆర్‌బీఐ నేతృత్వంలోని మానిటరీ కమిటీ నేడు(బుధవారం) ఈ పాలసీ నిర్ణయాన్ని ప్రకటించింది.
ఆరుగురు సభ్యులున్న ఈ కమిటీలో ఐదుగురు రెపో రేటు పెంపుకు ఆమోదం తెలుపగా.. ఒకరు మాత్రం వ్యతిరేకించినట్టు తెలిసింది. గత జూన్ పాలసీలో కూడా రెపోను 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.25 శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంధన ధరలు ఖరీదైనవిగా మారడంతో, జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టం 5 శాతానికి పెరిగింది. రివర్స్ రెపో రేటు 6.25 శాతంగా, ఎంఎస్‌ఎఫ్ రేటు, బ్యాంక్ రేటు 6.75 శాతంగా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.4 శాతంగా ఉంచింది. 2020 క్యూ1 ద్రవ్యోల్బణం 7.5 శాతంగా ఉండనున్నట్టు ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ అంచనావేస్తోంది. ఆర్‌బీఐ రెపో రేటు పెంచడంతో, మార్కెట్‌లో ద్రవ్యలభ్యత తగ్గనుంది. దీంతో మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment