ఇక వాట్స్‌యాప్ @ డెస్క్‌టాప్
గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో అందుబాటులోకి
శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్స్‌యాప్... డెస్క్‌టాప్, పర్సనల్ కంప్యూటర్లలోనూ గురువారం నుంచి తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. తద్వారా యూజర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకునే వ్యూహాలకు కంపెనీ తెరతీసింది.గతేడాది సుమారు 19 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని వెచ్చించి వాట్స్‌యాప్‌ను కొనుగోలు చేసిన ఫేస్‌బుక్...
ఈ కొత్త వెబ్ బ్రౌజర్ వెర్షన్ సర్వీసును ప్రారంభించింది. అయితే, ప్రస్తుతానికి దీన్ని గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ నుంచి అదీ ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు మాత్రమే వినియోగించుకునే వీలుంటుంది. ఐఫోన్‌లో వాట్స్‌యాప్ వాడుతున్న యూజర్లకు యాపిల్ కంపెనీ ప్లాట్‌ఫామ్ పరిమితుల కారణంగా ఈ వెబ్ సేవలు లభించవని వాట్స్‌యాప్ బ్లాగ్‌లో వెల్లడించింది.
మొబైల్‌తో అనుసంధానం...
యూజర్ తన ఫోన్‌లోని వాట్స్‌యాప్ అకౌంట్‌నే కంప్యూటర్‌లోని వెబ్ బ్రౌజర్ ద్వారా ఉపయోగించుకునేలా(మిర్రర్) ఈ సర్వీసు వీలుకల్పిస్తుందని వాట్స్‌యాప్ సంస్థ బ్లాగ్‌లో వెల్లడించింది. అంటే మొబైల్‌లోని వాట్స్‌యాప్‌కు ఎక్స్‌టెన్షన్ కింద లెక్క. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్స్‌యాప్‌కు 60 కోట్ల మందికిపైగా యూజర్లు ఉన్నట్లు అంచనా. భారత్‌లో వాట్స్‌యాప్ యూజర్ల సంఖ్య 7 కోట్లు.
ఈ సేవలను వినియోగించుకోవాలంటే..
యూజర్లు క్రోమ్ బ్రౌజర్‌లో ‘వెబ్.వాట్స్‌యాప్.కామ్’ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులోని క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేయాలి. దీంతో మొబైల్ ఫోన్‌లోని వాట్స్‌యాప్ అకౌంట్ బ్రౌజర్‌లో ప్రత్యక్షమవుతుంది. ఫోన్‌లో మెసేజ్‌లు పంపుకున్నట్లే బ్రౌజర్‌లోనూ దీన్ని ఉపయోగించొచ్చు. అయితే, మొబైల్‌లో తాజా వాట్స్‌యాప్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవడంతో పాటు మొబైల్‌ను నెట్‌తో కనెక్ట్ చేసి ఉంచడం తప్పనిసరి.