కప్పింగ్ చికిత్స!
ఓల్డ్ ఈజ్ న్యూ
ఒకనాటి ప్రాచీన ప్రక్రియకు ఇప్పుడు మళ్లీ ప్రాచుర్యం లభిస్తోంది. కానీ ఈ ప్రక్రియను ప్రాచీన ఈజిప్షియన్లు, చైనీయులు క్రీస్తుపూర్వం 1550 నాటికే ఉపయోగించేవారు. ప్రత్యామ్నాయ వైద్య చికిత్సల్లో అత్యంత ప్రాచీనమైనది కప్పింగ్ ప్రక్రియ. ఇందులో నొప్పి ఉన్న చర్మం భాగంలో ప్రత్యేకమైన ‘కప్’ల ద్వారా చర్మాన్ని కాసేపు పైకిలాగేట్లుగా, పీల్చడం (సక్షన్ ప్రక్రియ) జరుగుతుంది. దాంతో ఆ శరీర భాగంలో రక్తప్రసరణ ఎక్కువగా జరిగి నొప్పి లేదా ఇన్‌ఫ్లమేషన్ నుంచి ఉపశమనం వస్తుందనేది ఈ చికిత్స ప్రక్రియలోని భావన.
కప్‌ల రూపంలో ఉపయోగించేవి..
గాజుకప్పులు వెదురు బొంగులు మట్టితో చేసిన పాత్రలుసిలికాన్ కప్పులుకప్పింగ్ రెండు విధాలుగా జరుగుతుంది. మొదటిది డ్రై కప్పింగ్, రెండవది వెట్ కప్పింగ్.ఇందులో ఏ ప్రక్రియను ఉపయోగించినా... థెరపిస్ట్ ఆ కప్పులో ఆల్కహాల్‌నో, కొన్ని ఔషధ మొక్కలనో లేదా కాగితాన్నో మండిస్తారు. అలా కాల్చడం వల్ల కప్‌లోని ఆ ప్రాంతంలో శూన్య ప్రదేశం (వాక్యూమ్) ఏర్పడుతుంది. ఫలితంగా చర్మం ఆ కప్పులోకి లాగివేసినట్లుగా అవుతుంది. దాంతో చర్మం పైకి ఉబుకుతుంది. అప్పుడు ఆ ప్రాంతంలోని రక్తనాళాలూ విశాలం అవుతాయి. అయితే ఆధునిక కప్పింగ్ ప్రక్రియలో కాల్చడం వంటివి చేయకుండా రబ్బర్ పంప్‌ను ఉపయోగించడం ద్వారా కప్ ఉన్న ప్రదేశంలో వాక్యుమ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇలా కప్‌ను ఉన్న ప్రదేశాన్ని పదే పదే మార్చడం ద్వారా మసాజ్ జరిగినట్లుగా కప్పింగ్ చేస్తుంటారు. ఇది డ్రై కపింగ్‌లో అనుసరించే పద్ధతి.ఇక వెట్ కప్పింగ్‌లో ఇదే ప్రక్రియ అనుసరిస్తారుగానీ... ఆ తర్వాత ఉబికిన చర్మంపై నుంచి చిన్న స్కాల్‌పెల్ సహాయంతో గాటు పెట్టి ఒకటి రెండు రక్తనాళాల ద్వారా కాస్త రక్తం పైకి ఉబికేలా చేస్తారు.
పని చేస్తుందన్న దాఖలాలేమీ లేవు...
కప్పింగ్ ప్రక్రియకు శాస్త్రబద్ధమైన తార్కాణాలు ఏమీ లేవు. ఇది సంప్రదాయ చికిత్స ప్రక్రియలకు ఒక ప్రత్యామ్నాయం మాత్రమేగానీ... దీనితో ఒనగూరే ప్రయోజనాలు ప్రత్యేకంగా లేవు. 2012లో పీఎల్‌ఓఎస్ అనే హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన అంశాల ప్రకారం... ఇది ఆక్యుపంక్చర్‌లాంటి ఒక ప్రత్యామ్నాయ వైద్య చికిత్స ప్రక్రియ. అయితే బ్రిటిష్ కప్పింగ్ సొసైటీ మాత్రం ఈ కింది జబ్బుల్లో ఈ ప్రక్రియ సమర్థంగా పనిచేస్తోందని చెబుతోంది. వాటిలో కొన్ని...
►ఆర్థరైటిస్, ఫైబ్రోమయాల్జియా వంటి రుమాటిక్ డిజార్డర్స్
►మొటిమల వంటి చర్మ సంబంధిత సమస్యలు అధిక రక్తపోటు
సైడ్ ఎఫెక్ట్స్: శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్ నిర్వహిస్తే ఇది సురక్షితమైన ప్రక్రియేగానీ... కొన్ని సైడ్‌ఎఫెక్ట్స్ కనిపించినప్పుడు మాత్రం దీన్ని కొనసాగించకూడదు. అవి.. చికిత్స ప్రక్రియ నిర్వహించే సమయంలో ఇబ్బంది (డిస్‌కంఫర్ట్) చర్మం కాలడం చర్మంపై గాయాలు కావడం
చర్మానికి ఇన్ఫెక్షన్లు ముందుగా ఆ నిపుణులను అడగాల్సినవి...
►కప్పింగ్ ప్రక్రియలో వారు అనుసరించే విధానం ఏమిటి? వారికి ఉన్న శిక్షణ
►వారు ఎంతకాలంగా ఈ ప్రక్రియను అనుసరిస్తున్నారు. (అనుభవం)
►ఇంతకుముందు తనకు ఉన్న సమస్యలకు ఆ ప్రక్రియ ద్వారా ఒనగూరిన మేలు.
►ఇతర ప్రక్రియలతో పోలిస్తే కప్పింగ్ వల్ల ఆ సమస్యకు కలిగే ఉపశమనం.
ఇదో నమ్మకం మాత్రమే...
ఇలా కప్పింగ్ చేయడం ద్వారా ఒంట్లోని కాలుష్యాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. కొంతమంది ‘నీడిల్ కప్పింగ్’ చేస్తుంటారు. అంటే ఈ ప్రక్రియలో ఆక్యుపంక్చర్‌ను కూడా కప్పింగ్‌కు తోడు ఉపయోగిస్తుంటారు.