నాకు మంచి గుణపాఠం...
ముంబై: నోబెల్ బహుమతి గెల్చుకున్నందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామాతో డిన్నర్ ఉన్నాసరే .. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.. అలా చేస్తే మీ శరీరం నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది.. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది.. దయచేసి మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా ఉండకండి అని గట్టి సలహా ఇస్తున్నారు ప్రఖ్యాత గాయకుడు కైలాష్ ఖేర్.
న్యూయార్క్ నుంచి వచ్చీ రావడంతోనే అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యానంటూ ఆయన కామెంట్ చేశారు. తాను ఆసుపత్రి బెడ్పై ఉన్న ఫొటో ఒకదాన్ని ఆయన ఈ సందర్భంగా శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్లనే తొలిసారి గుజరాత్లో ఏర్పాటుచేసిన ఒక షోను రద్దు చేసుకున్నానని కైలాష్ తెలిపారు. ఇది తనకు మంచి గుణపాఠమని, అందుకే ఆరోగ్యం విషయంలో ఎవ్వరూ అశ్రద్ధగా ఉండొద్దని, ఎప్పటికీ ప్రపంచమంతా ఆరోగ్యంతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
తేరీ దీవానీ.. దీవానీ అంటూ సంగీతాభిమానులను మైమరపింపజేసిన గాయకుడు కైలాష్ అనారోగ్యం పాలై ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.