'ఆ సినిమా నేను చేయలేనేమో..?'
కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాదు.. జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడిగా మణిరత్నానికి మంచి పేరుంది. ముఖ్యంగా నిజజీవిత కథలను సినిమాటిక్గా తెరకెక్కించటంలో మణి మంచి విజయాలు సాధించారు. రామాయణ, మహాభారతాలను కథా వస్తువులుగా ఎంచుకునే ఈ క్రియేటివ్ జీనియస్, ఇద్దరు, గురు లాంటి సినిమాలతో సెలబ్రిటీల జీవితాలను కూడా వెండితెర మీద ఆవిష్కరించారు.
ఈ నేపథ్యంలో బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మణిరత్నానికి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కించవచ్చు కదా అని అభిమాని అడిగిన ప్రశ్నకు మణి చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. 'రజనీ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలనుకోవటం మంచి ఆలోచనే, కానీ ఆ పాత్రకు సరిపోయే నటుడు దొరకటం చాలా కష్టం. అందుకే ఆ సినిమా నేను చేయలేనేమో' అన్నాడు మణిరత్నం.
గతంలో మణిరత్నం, రజనీకాంత్ల కాంబినేషన్లో వచ్చిన దళపతి ఘనవిజయం సాధించింది. కర్ణుడు, దుర్యోధనుడి పాత్రల ఇన్‌స్పిరేషన్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో నటించాడు. తమిళనాట క్లాసిక్గా నిలిచిపోయిన ఈ సినిమా తరువాత ఈ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా రాలేదు.