మాకు స్ఫూర్తి రజనీ గారే!
మహాభాష్యం చిత్తరంజన్,
ప్రముఖ లలిత సంగీత విద్వాంసులు
ప్రముఖ కవి, గాయకుడు, వాగ్గేయకారుడు, స్వరకర్త రజనీగారు లలిత సంగీత వికాసానికీ, అభివృద్ధికీ ఎనలేని సేవలందించారు. ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో 1941లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎన్నో మధురమైన లలిత గీతాలు ఆయన కలం నుంచి జాలువారాయి. ఉమర్ ఖయ్యాయి తత్త్వాన్ని వర్ణిస్తూ కృష్ణశాస్త్రి గారు రాసిన ‘అతిథిశాల’కు ఆయన పర్షియన్ సంగీతపు పోకడలతో అద్భుతమైన బాణీలు కూర్చారు. ఆయనే ఖయ్యావయిగా కూడా నటించి పాడారు. మా తండ్రి గారు, రజనీ గారి తండ్రి గారు పిఠాపురం వాస్తవ్యులు.
అందుకని ఆయనకు నా పైన ప్రత్యేకమైన ప్రేమ, వాత్సల్యం. 1963లో హైదరాబాద్ ఆకాశవాణిలో ఈ నాటిక ప్రసారమైనప్పుడు ఆయనతో పాటు నేనూ అందులోని పాటలు పాడాను. అరబ్బీ సంగీత పద్ధతిలో పాటలే కాక పద్యాలు కూడా చదవడం అంత తేలికైన విషయం కాదు. కర్ణాటక, హిందుస్తానీ సంగీతంలో వాడుకలో లేని రాగాలెన్నిటినో ఉపయోగించడం లాంటి ప్రయోగాలెన్నో చేసిన మొట్టమొదటి వ్యక్తి - రజనీగారు. ఆ తరువాత పాలగుమ్మి విశ్వనాథం గారు, ఆ పైన నేను కూడా వాడుకలో లేని అనేక రాగాల్ని వినియోగించి, ప్రజారంజక గీతాలు తయారుచేశాం. ఆ విషయంలో మా అందరికీ స్ఫూర్తి రజనీ గారే.