ముంబై: తన క్షేమం కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని నటుడు శివిన్ నారంగ్ అన్నాడు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని.. తనను జాగ్రత్తగా చూసుకున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. ముంబైలోని తన నివాసంలో శివిన్ జారిపడిన విషయం తెలిసిందే. కళ్లు తిరిగి గాజు గ్లాసుపై పడిపోవడంతో గాయాలపాలయ్యాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో హుటాహుటిన కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించగా సర్జరీ నిర్వహించారు. ఈ క్రమంలో బుధవారం ఇంటికి చేరుకున్న శివిన్ సోషల్ మీడియా వేదికగా తన శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపాడు. (టీవీ నటుడికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు)
తాను ఆస్పత్రి బెడ్ మీద పడుకుని ఉన్న ఫొటోలు షేర్ చేసి.. ‘‘ స్నేహితులు, నన్ను ప్రేమించే వాళ్లు, నా కుటుంబ సభ్యులు మీ ఆశీర్వాదాలతో ఇంటికి తిరిగి వచ్చేశాను. దురదృష్టవశాత్తూ ఇంట్లో చోటుచేసుకున్న ప్రమాదంలో ఆస్పత్రి పాలయ్యాను. సర్జరీ చేశారు. కోకిలాబెన్ ఆస్పత్రి డాక్టర్లు, ఇతర సిబ్బందికి రుణపడి ఉంటా. కఠిన పరిస్థితుల్లో(కోవిడ్-19 వ్యాప్తిని ఉద్దేశించి)నూ వారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మీకు ఇదెలా సాధ్యమని.. ఓ వ్యక్తిని అడిగాను. ‘‘ మేం చేయకపోతే ఇంకెవరు సేవ చేస్తారు’’అని వారు సమాధానమిచ్చారు. నిజమైన హీరోలు వాళ్లే. వారిని అందరూ గౌరవించాల్సిందే’’ అని శివిన్ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందిన అభిమానుల భయాలు తొలగించాడు. కాగా శివిన్ ప్రస్తుతం బేహద్ 2 సీరియల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో పలు రియాలిటీ షోల్లోనూ అతడు పాల్గొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment