దేశంలో 500 కోవిడ్‌ మరణాలు | Sakshi
Sakshi News home page

దేశంలో 500 కోవిడ్‌ మరణాలు

Published Tue, Jul 14 2020 4:05 AM

Covid-19 cases takes India's tally to 8,78,254 - Sakshi

న్యూఢిల్లీ: ఇండియాలో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 28,701 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  500 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ఇప్పటివరకు మొత్తం కేసులు 8,78,254కు, మరణాలు 23,174కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. మొత్తం బాధితుల్లో 5,53,470 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,01,609 మంది చికిత్స పొందుతున్నారు. అంటే 63.01 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,18,06,256 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.  

19 రాష్ట్రాల్లో అధిక రికవరీ రేటు
దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం63.02 కాగా, 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది జాతీయ సగటు కంటే అధికంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. కరోనా మరణాల శాతం 2.64 కాగా, 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువగానే ఉందని పేర్కొంది. తెలంగాణలో రికవరీ రేటు 64.84 శాతమని వెల్లడించింది.

ఫవిపిరవిర్‌ ధర 27%  తగ్గింపు
కోవిడ్‌ చికిత్సలో వాడే యాంటీ వైరల్‌ డ్రగ్‌ ‘ఫవిపిరవిర్‌’ మాత్రల ధరను 27 శాతం తగ్గించినట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ తెలిపింది. ఒక్కో మాత్ర ఖరీదు రూ.103 కాగా, ఇకపై రూ.75కు అమ్ముతారు. మాత్రలు ఫాబీఫ్లూ అనే బ్రాండ్‌ నేమ్‌తో లభ్యమవుతున్నాయి. వీటిని గత నెలలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫవిపిరవిర్‌ను ఇప్పుడు భారత్‌లోనే తయారు చేస్తున్నామని, అందుకే ఖర్చు తగ్గిందని, ఆ ప్రయోజనాన్ని కరోనా బాధితులకు బదిలీ చేస్తున్నామని గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement