సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) చరిత్రలో టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా బెంగళూరు రాప్టర్స్ జట్టు నిలిచింది. గచ్చి బౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ జట్టు 4–2తో తొలిసారి ఫైనల్ చేరిన నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టును ఓడించింది. తొలి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ 14–15, 15–9, 15–3తో లీ చెయుక్ యియు (వారియర్స్)పై నెగ్గి బెంగళూరుకు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో బొదిన్ ఇసారా–లీ యోంగ్ డే (వారియర్స్) జంట 15–11, 13–15, 15–14తో అరుణ్ జార్జి–రియాన్ అగుంగ్ సపుత్రో (బెంగళూరు) జోడీపై గెలిచింది.
ఈ మ్యాచ్‌ను వారియర్స్ ‘ట్రంప్’గా ఎంచుకోవడంతో ఆ జట్టు 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో తై జు యింగ్ (బెంగళూరు) 15–9, 15–12తో మిచెల్లి లీని ఓడించింది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో చాన్ పెంగ్ సూన్–ఎమ్ హై వన్ (బెంగళూరు) ద్వయం 15–14, 14–15, 15–12తో గారగ కృష్ణప్రసాద్–కిమ్ హా నా (వారియర్స్) జోడీపై నెగ్గింది. ఈ మ్యాచ్‌ను బెంగళూరు ‘ట్రంప్’గా ఎంచుకోవడంతో ఆ జట్టు 4–2తో ఆధిక్యంలోకి వెళ్లి విజయాన్ని ఖాయం చేసుకుంది. చివరిదైన ఐదో మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టు గెలిచినా తుది ఫలితం మారే అవకాశం లేకపోవడంతో దానిని నిర్వహించలేదు.
విజేత బెంగళూరు జట్టుకు ట్రోఫీతోపాటు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. రన్నరప్ నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టుకు రూ. కోటీ 50 లక్షలు... సెమీఫైనల్స్‌లో ఓడిన పుణే సెవెన్ ఏసెస్, చెన్నై సూపర్ స్టార్స్ జట్లకు రూ. 75 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది. లీగ్ దశలో నిలకడగా ఆడిన హైదరాబాద్ హంటర్స్ క్రీడాకారిణి నేలకుర్తి సిక్కి రెడ్డికి ‘ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ పురస్కారం లభించింది. తై జు యింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డు సొంతం చేసుకుంది. హైదరాబాద్ హంటర్స్‌కే చెందిన ప్రియాన్షు రజావత్‌కు ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment